పొరుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో పరుగులు పెడుతున్న కృష్ణమ్మ

పొరుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో పరుగులు పెడుతున్న కృష్ణమ్మ

వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రి వద్ద గోదావరిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతున్నది. నిన్న ఉదయం 23.1 అడుగులు ఉన్న వరద ప్రవాహం సాయంత్రం 6 గంటలకు 24 అడుగులకు చేరింది. ఇది ఇవాళ 30 అడుగులు చేరుకునే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామన్నారు. 48 అడుగులకు రెండవ ప్రమాద హెచ్చరిక, 52 అడుగులకు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని తెలిపారు. వరద పెరిగితే ఏజెన్సీ గ్రామాలకు జలగండం ఉండే అవకాశం ఉందని చెప్పారు.

పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానది పరుగులు పెడుతోంది. దీంతో జలశయాల్లో జలకళ సంతరించుకుంటోంది. కర్ణాటకలోని నారాయణపూర్‌ నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో జూరాల జలశయానికి వరద నీరు చేరింది. 10 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. ఇది లక్ష క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇవాళ కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశముంది.

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజికి భారీగా నీరు చేరుకుంది. ప్రస్తుతం నీటిమట్టం 11.4 అడుగులు. కృష్ణా, తూర్పు ప్రధాన కాల్వకు 3,800 క్యూసెక్కులను వదిలిపెట్టారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 1200 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్‌కు 200 క్యూసెక్కులు, కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ నుంచి రైవస్‌ కాల్వకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బందరు కాల్వకు 700 క్యూసెక్కులు, కేఈబీ కాల్వకు 500 క్యూసెక్కులు, సాగునీటి కోసం ఏలూరు కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

Tags

Read MoreRead Less
Next Story