కాఫీ డే అధినేత ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు

కాఫీ డే అధినేత ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు

కాఫీ కింగ్, కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోమవారం మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ఆ తర్వాత కన్పించకుండా పోయారు. దీంతో ఆయన ఏమయ్యారన్నది అంతు చిక్కకుండా పోయింది. అటు.. సిద్ధార్థ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆయన నదిలోకి దూకి ఉంటారనే అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు ముందు సిద్ధార్థ తన కాఫీడే కంపెనీకి రాసిన లేఖే దీనికి కారణం.

అటు.. సిద్ధార్థ కోసం 300 మందికి పైగా పోలీసులు గాలిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు. వీజీ సిద్దార్ద... కర్ణాటక మాజీ సీఎం , బీజేపీ నేత ఎస్‌.ఎం. కృష్ణ అల్లుడు. ఆయన అదృశ్యం గురించి తెలియగానే సీఎం యడియూరప్ప, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఎస్‌ఎం కృష్ణ నివాసానికి చేరున్నారు.

సిద్ధార్ధ గాలింపు కోసం.. కేంద్రాన్ని సాయం కోరింది కర్ణాటక ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. గాలింపు కష్టమవుతోందని, ఆయన్ను వెతికేందుకు సెంట్రల్‌ గార్డులతో పాటు కేంద్ర బలగాలను పంపాలని కోరారు. దీంతో పాటు హెలికాఫ్టర్‌ను సైతం పంపాలని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 20శాతం పడిపోయాయి. దీంతో లోయర్‌ సర్క్యూట్‌ మార్కు అయిన 154.05ను తాకింది. సిద్ధార్థ అదృశ్యం కావడంతో మదుపర్లలో ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఉదయం సమయంలో ఈ కంపెనీ స్టాక్‌.. లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది.

Tags

Read MoreRead Less
Next Story