మాజీ సీఎం అల్లుడు మిస్సింగ్‌ మిస్టరీ

మాజీ సీఎం అల్లుడు మిస్సింగ్‌ మిస్టరీ

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం అల్లుడు, కేఫె కాఫీ డే అధినేత వీజీ సిద్దార్ద అదృశ్యమయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఆయన కనిపించకుండపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ కూతురు మాళవికను వివాహం చేసుకున్న వీజీ సిద్దార్దకు బిజినెస్‌ రంగంలో మంచి పేరుంది. పలురంగాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌ అనంతరం ఆయన ముంబయిలో జేఎమ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. తర్వాత బెంగళూరు వచ్చి సొంతంగా శివం సెక్యూరిటీస్‌ పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు. అనంతరం కంపెనీ పేరును గ్లోబల్‌ టెక్నాలజీగా పేరు మార్చారు. ఐటీ రంగంలో మంచి పేరు సంపాదించారు. దీంతోపాటు సిద్దార్ద కేఫె కాఫీ డే పేరుతో చిన్న హోటల్స్‌ ప్రారంభించారు. 1990లో చిన్న కాఫీ షాపుగా మొదలుపెట్టిన కాఫీ డే అనతి కాలంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. అనంతరం అనేక వ్యాపారాల్లోకి విస్తరించారు. చిక్‌మాగళూరులో తన సొంత కాఫీ ఎస్టేట్‌ లో పండే కాఫీని ఇందులో వినియోగిస్తున్నారు. ఆసియాలో అతిపెద్ద కాఫీ ఎస్టేట్‌ కలిగిన వ్యాపారవేత్తగా ఆయనకు పేరుంది. ప్రపంచవ్యాప్తంగా కేఫ్‌ కాఫీడేకు మంచి పేరు వచ్చింది. స్టార్‌ హోటల్స్‌, రిసార్ట్స్‌ వ్యాపారం కూడా ఉంది.

ఇటీవల మైండ్ ట్రీ కంపెనీలో తన వాటా అమ్మగా దాదాపు 3వేల కోట్ల రూపాయలు వచ్చాయి. తాజాగా తన కాఫీ కేఫ్‌ డే ను కూడా విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. ప్రముఖ బహుళజాతి సంస్థ కోకో-కోలా కంపెనీతో చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే వ్యాపార లావీదేవీలు ఇతర కారణాలు ఏమైనా ఆయన మిస్సింగ్‌ కారణమా? లేక కుటుంబ కలహాలు, ఇతర సమస్యలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయినా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్న సిద్దార్ద ఇలా హఠాత్తుగా మాయం కావడంపై కార్పొరేట్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story