ఇండియాలో కార్లు కడిగాడు.. ఆస్ట్రేలియాలో ఎమ్మెల్యే అయ్యాడు

ఇండియాలో కార్లు కడిగాడు.. ఆస్ట్రేలియాలో ఎమ్మెల్యే అయ్యాడు

ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా తన చదువుకు అవి ఆటంకం కాకూడదనుకున్నాడు. చదువంటే ఇష్టం. అందుకోసం ఎంత కష్టమైనా భరించేవాడు. ఏపని చెప్పినా ఇష్టంగా చేసేవాడు. కార్లు కడగడం, రెస్టారెంట్లలో పనిచేయడం. అంచలంచెలుగా ఎదిగి ఆస్ట్రేలియాలో అడుగు పెట్టి ఎమ్మెల్యేగా ఎదిగాడు. అతడే చండీగఢ్‌కు చెందిన దీపక్ రాజ్ గుప్తా. గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివిన గుప్తా డీఏవీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత పై చదువుల కోసమని ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నాడు. అందుకోసం డబ్బు సమకూర్చుకునేందుకు కార్లు కడిగాడు, రెస్టారెంట్లలో పని చేశాడు. చదువుకోవాలనే ఆసక్తే అతడి చేత పనులు చేయించిందని అన్న అనిల్ చెబుతాడు.

1989లో ఆస్ట్రేలియాలో ఐటీ చదువు పూర్తి చేశాడు దీపక్. చదువు పూర్తైన తరువాత డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. ఆ తరువాత పదేళ్లు ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (ఏఐబీసీ) ప్రెసిడెంట్‌గా పని చేశారు. అందులోనే ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ మెంబర్‌గానూ ఉన్నాడు. గుంగాహ్లిన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంగళవారం గుప్తా.. భగత్ గీత పట్టుకుని మరీ ప్రమాణ స్వీకారం చేశాడు. ఆస్ట్రేలియన్ కాపిటల్ టెర్రిటరీ శాసనసభకు ఎన్నికైన మొదటి ఇండియన్-ఆస్ట్రేలియన్‌గా గుప్తా నిలిచాడు.

Tags

Read MoreRead Less
Next Story