గోదావరి వరద ఉధృతికి కొట్టుకుపోయిన నిత్యహారతి పంటు

గోదావరి వరద ఉధృతికి కొట్టుకుపోయిన నిత్యహారతి పంటు

రాజమహేంద్రవరంలో గోదావరి వరద ఉధృతికి నిత్యహారతి పంటు కొట్టుకుపోయింది. ఏకంగా పుష్కర ఘాట్ నుంచి ధవళేశ్వరం వరకూ ఇది వెళ్లిపోయింది. అక్కడ ధవళేశ్వరం బ్యారేజీ గేటు అడ్డుతగిలి ఆగింది. 29వ గేటు ఖానా వద్ద పంటు నిలిచింది. దీనికి కారణం ఏంటి.. ఒడ్డున పటిష్టంగా ఉండాల్సిన పంటు ఎందుకు కొట్టుకుపోయింది అంటే ఇది సిబ్బంది, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లేనని తెలుస్తోంది.

గోదావరి పుష్కరాల సమయంలో నిత్యహారతి కోసం ఈ పంటును నదిలో ఏర్పాటు చేసారు. ఇనుముతో చేసిన పడవలాంటి వేదికపై అప్పటి నుంచి ప్రతిరోజూ హారతి కార్యక్రమం కన్నులపండువగా సాగుతూనే ఉంది. ఇప్పుడు వరదల కారణంగా పంటుకు కట్టిన తాళ్లు తెగిపోయాయి. గోదావరి ఉధృతంగా ప్రవహించే సమయంలో ఇలాంటివి పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోలేదు. ఆ కారణంగానే ఇప్పుడు నిత్యహారతి పంటు.. ఏకంగా 2 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story