Top

మరో తీపికబురు అందించిన వాతావరణ శాఖ..

మరో తీపికబురు అందించిన వాతావరణ శాఖ..
X

అల్పపీడనంతో పాటు రుతుపవనాల విస్తరణతో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదురోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత కూడా పరవళ్లు తొక్కుతోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ గేట్లను అరమీటరు మేర ఎత్తి ఉంచారు. ప్రస్తుతం గోదావరిలో నీటి మట్టం 28 అడుగులకు చేరింది.

భారీ వర్షాలు కురుస్తుండటంతో నిర్మల్‌ జిల్లా స్వర్ణ జలాశయంలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరుతోంది. దీంతో ఇంతకాలం వెలవెలపోయిన ప్రాజెక్ట్‌ ఈ జలకళను సంతరించుకుంది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 11 వందల 83 అడుగులు కాగా ప్రస్తుతం 11 వందల 74 అడుగుల మేర నిల్వ ఉంది.

మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్ట్‌ నిండు కుండలా మారుతోంది. కర్నాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి నీళ్లు వదలడంతో తంగిడి ప్రాంతంలో తొలి అడుగువేసింది కృష్ణమ్మ. ప్రవాహం ఇలాగే కొనసాగితే గేట్లు తెరిచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేయనున్నారు. మరోవైపు జూరాల ఎడమ కాల్వకు నీటిని రిలీజ్ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌. దీంతో నాట్లు వేసుకొని నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మూడు రోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. దీంతో ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి కాస్త స్వాంతన చేకూరింది. భారత వాతావరణ శాఖ మరో తీపికబురు అందజేసింది. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.

Next Story

RELATED STORIES