తాజా వార్తలు

తెలంగాణలో భారీ వర్షాలు.. తీవ్ర అవస్థలు పడుతున్న ఏజెన్సీ వాసులు

తెలంగాణలో భారీ వర్షాలు.. తీవ్ర అవస్థలు పడుతున్న ఏజెన్సీ వాసులు
X

తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. వరదలతో జిల్లాల్లోని కొన్ని గ్రామాలు నీటిలో చిక్కుకుపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంటలు కూడా నీట మునిగిపోయి నష్టాన్ని మిగిల్చాయి. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఖరీఫ్ మొదలై రెండు నెలలు గడిచినా, వానలు రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ఈ వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భారీ వర్షాలకు వరంగల్ జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ వాసులు తీవ్ర అవస్థలు పడ్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గోదావరి 7.5 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి వరదనీరు చేరి..బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో లక్షా 70వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలోని ఏడు మెలికవాగు, జిల్లేరు, కిన్నెరసాని ఉప్పొంగడంతో పలుగ్రామాలు జలదిగ్భందమయ్యాయి.

భారీవర్షాలు, ఎగువనుంచి వరదతో తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పూర్తి లెవెల్‌ 100 మీటర్లు కాగా.. 96 మీటర్లకు నీరు చేరింది. దీంతో 30 గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్‌ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. అంతేస్థాయి ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి జూరాల రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.6 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 8.6 టీఎంసీలకు చేరింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, మెహిదీపట్నం, సికింద్రాబాద్, వారసిగూడ, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్లలో వర్షం కురిసింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు గ్గా కదులుతున్నాయని వెల్లడించారు.

Next Story

RELATED STORIES