భారీ వర్షాలకు నీటమునిగిన పంటలు

భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో వేలాది ఎకరాల్లో వరిపొలాలు ముంపునకు గురయ్యాయి. మేజర్ డ్రైన్ల ద్వారా నీరు సముద్రంలోకి వెళ్లకపోవడంతో రైతులు నష్టపోయారు. అల్లవరం మండలం రామేశ్వరం సముద్ర మొగ వద్ద అడ్డుగా ఉన్న ఇసుక మేటలను జేసీబీతో తొలగిస్తున్నారు. దీంతో వాసాలాతిప్ప, లోయక్ కౌశిక, పంచనది డ్రెయిన్లకు మార్గం సుగమమైంది.
వానలు, వరదలతో కోనసీమలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నారుమడులు గత కొన్ని రోజులుగా నీటిముంపులోనే ఉన్నాయి. అటు డ్రయిన్ల మొగలు తరుచుగా పూడికపోవడంపై స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గోదావరి వరద ఉధృతితో లంకగ్రామాల్లో ఆందోళన పెరుగుతోంది. ముమ్ముడివరం నియోజకవర్గ పరిధిలోని ఠాణేలంక, కూనాలంక, గురజాపులంక, చింతపల్లి లంక, లంకాఫ్ గేదెల్లంక, పొగాకులం, సలాదివారి పాలెం, గోగుళ్లంక గ్రామాల్లో వరద నీరు పెరుగుతోంది.
లంకగ్రామాల్లో వరదనీరు చేరుతుండటంతో బెండ, దొండ,వంగ, టామాటా, పచ్చిమర్చీ, బీర పంటలు ముంపుబారిన పడుతున్నాయి. రైతులు కొబ్బరి కాయలను బయటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు ఆక్వా రైతులు కూడా రొయ్యల్ని బయటికితీసి ఎంతోకొంతకు అమ్ముకుని నష్టం రాకుండా ప్రయత్నిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పడుతోంది.మూడురోజులుగా పోలవరం ప్రాజెక్ట్, ఏజెన్సీ ప్రాంతాన్ని వణికించిన గోదవరి ప్రస్తుతం నిలకడగా ఉంది. రాష్ట్ర మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు పోలవరం చేరుకుని సమీక్ష నిర్వహించారు. పోలవరం వద్ద గోదావరికి వస్తున్న వరద ఉధృతితో కాఫర్ డ్యామ్‌కు నష్టంలేదన్నారు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. పోలవరం మండలంలో 19 గ్రామాలు, వేలేరుపాడు మండలంలో 3 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ముంపు గ్రామాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com