‘జల వివాదాల’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. నీటి పంచాయితీలకు చెక్

‘జల వివాదాల’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. నీటి పంచాయితీలకు చెక్

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల నీటి వివాదం, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య గోదావరి పంచాయితీ, తమిళనాడు - కర్ణాటక మధ్య కావేరి జలాల పంచాయితీ ఇలా నదీ జలాల కోసం రాష్ట్రాలు పేచీలు పెట్టుకుంటున్నాయి. కొర్రీలు వేస్తూ ఎవరికివారు ట్రిబ్యునల్ ఆశ్రయించటం..చివరికి అప్పటికప్పుడు తాత్కాలిక సర్దుబాటుతో సర్దిచెబుతూ రావటం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న నదీ జలాల వివాదాలను సత్వరమే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం పిలుపునిచ్చింది. నదీజలాల పరిష్కారాల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించింది.

దేశంలోని నదుల నుంచి దాదాపు 70 వేల టీఎంసీల నదీ నీరు వృద్ధాగా సముద్రంలో కలుస్తున్నాయి. అయితే..ఇందులో కేవలం 40 వేల టీఎంసీలతో దేశంలో పంటలకు నీరు అందించవచ్చు. ప్రతీ ఎకరాను సాగులోకి తీసుకురావొచ్చు. మరో 10 వేల టీఎంసీల నీటిని పరిశ్రమలకు కేటాయించాల్సి ఉంటుంది. అంటే 70 వేల టీఎంసీలలో మనం 50 వేల టీంఎసీల నీరు వాడుకోగలిగితే అద్భుతాలు సాధించవచ్చు. అందుకే దేశ వ్యాప్తంగా నీటి కోసం జాతీయ జల విధానం రావాల్సి ఉంటుందని లోక్ సభలో తన వాదననను వినిపించింది టీఆర్ఎస్. అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న టీఆర్ఎస్ తాము బిల్లుకు మద్దతు ఇస్తున్నామని అంటోంది.

నదీజలాల పరిష్కారాల బిల్లు ఉద్దేశాన్ని స్వాగతించిన తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు.. వివాదాల పరిష్కారానికి అనేక చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించిన వ్యవస్థ ఏదీ బిల్లులో లేదని రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు.

అటు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ మాత్రం జల వివాదాలను రాష్ట్రాలు సామరస్యంతో పరిష్కరించుకోవాలని సూచించారు. కృష్ణా ట్రైబ్యునల్‌లో నెలకొన్న వివాదాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాలు ఈ రీతిలో వివాదాన్ని పరిష్కరించుకుంటే.. యావత్‌ దేశానికి రెండు రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తాయని షెకావత్‌ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయపర్చుకున్న తీరును, పరస్పర సహకారాన్ని సభలో వినిపించింది టీఆర్ఎస్. జాతీయ జల విధానంతో నీటి పంచాయితీలకు చెక్ పడుతుందని అభిప్రాయపడింది.

Tags

Read MoreRead Less
Next Story