20 ఏళ్లనుంచి ఫ్రిజ్‌లోనే ఆ బాక్స్‌.. దాన్ని ఓపెన్ చేసేసరికి..

20 ఏళ్లనుంచి ఫ్రిజ్‌లోనే ఆ బాక్స్‌.. దాన్ని ఓపెన్ చేసేసరికి..

అమ్మని చాలాసార్లు అడిగాడు. ఫ్రిజ్‌లో ఉంచిన బాక్సులో ఏముందని. నీకెందుకు అవన్నీ. నీక్కావలసిందేదో పెడుతున్నానుగా తిను అని ఎప్పటికప్పుడు దాటవేసింది. కానీ ఆమె తనువు చాలించిన అనంతరం ఆ బాక్స్ తెరిచి చూసాడు. అంతే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు స్మిత్. అమెరికాలోని మిస్సోరిలో నివసిస్తున్న ఆడమ్ స్మిత్ గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోంది. 20 ఏళ్ల నుంచి ఆమె ఒక్కతే ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆరోగ్యం బాగోపోయినా అక్కడే ఉన్న తన తల్లిని చూడ్డానికి స్మిత్ సెయింట్ లూయీస్ వెళ్లాడు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో తల్లి మరణించింది. ఆమె మరణానంతరం ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయేమో అని వెతక సాగాడు స్మిత్.

ఈ క్రమంలో అతడికి ఫ్రిజ్‌లో ఉన్న బాక్స్ గుర్తుకు వచ్చింది. తల్లిని ఎప్పుడు బాక్సు గురించి అడిగినా సరైన సమాధానం చెప్పలేదు. కనీసం మరణించే ముందైనా దాని గురించి చెప్పలేదు. ఆదివారం (జులై21న)తల్లి అంత్యక్రియలు ముగియడంతో ఇంటిని శుభ్రం చేయించే పనిలో పడ్డాడు స్మిత్. అప్పుడే ఫ్రిజ్ ఓపెన్ చేసి అందులోని బాక్స్‌ని బయటకు తీశాడు. బాక్స్ బరువుగా ఉండేసరికి ఏదో విలువైన వస్తువే వుండి వుంటుందని భావించాడు. తీరా తెరచి చూసే సరికి కళ్లు తిరిగినంత పనైంది స్మిత్‌కి.

మంచు ముద్దలా గడ్డకట్టుకుపోయిన ఓ పసిగుడ్డు.. బాక్సులో మృత శిశువు.. ఇన్నేళ్లు గడిచినా శిశువు చర్మం, జుట్టు అన్ని అవయవాలు ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉండడం ఆశ్చర్యం కలిగించింది స్మిత్‌కి. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల్లి చివరి రోజుల్లో కూడా బాక్సు గురించి ఏమీ చెప్పకపోవడంతో దాని గురించి తనకేమీ తెలియదన్నాడు స్మిత్ పోలీస్ ఎంక్వైరీలో. పోలీసు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులతో పాటు స్మిత్‌కి కూడా బాక్స్, అందులోని శిశువు ఎవరనేది మిస్టరీగానే మారింది.

Tags

Read MoreRead Less
Next Story