అలా చేయకుంటే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుంది : చంద్రబాబు

అలా చేయకుంటే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుంది : చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగను వెనక్కి వెళ్లాలంటూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఘాటుగా స్పందించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదని ఎగతాళి చేశారని.. కానీ ఈ రోజు స్పిల్‌వేలో ఉండే రివర్స్‌ స్లుయీజ్‌ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని మళ్లించారని ఆయన ట్వీట్‌ చేశారు. అవహేళనలను, ఆరోపణలని ఎదుర్కొంటూనే 70 శాతం నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. ఇంత చేసినా.. మిగిలిన 30 శాతం పూర్తి చేయకపోతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందన్నారు చంద్రబాబు. వరద సమయంలో ప్రాజెక్టు కోసం పని చేస్తున్న కంపెనీలకు వెనక్కు వెళ్లిపోవాలి అంటూ నోటీసులు ఇచ్చారని.. దీన్ని బట్టే ప్రాజెక్టు నిర్మాణం పట్ల జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్థం అవుతోందన్నారు చంద్రబాబు.

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. దేశంలో ఎక్కడాలేని విధంగా వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ రుణాలు అంటూ రైతులను మోసం చేయబోయి జగన్‌.. సున్నా అయ్యారంటూ లోకేష్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో మేమిచ్చామని టీడీపీ అంటే.. ఇవ్వలేదని రుజువు చేస్తే రాజీనామా చేస్తారా అని చాలెంజ్‌ చేశారు. మరుసటి రోజు తన నోటితోనే టీడీపీ హయాంలో 630 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చారని జగన్‌ ఒప్పుకున్నారు. ఇంత చేసి 3 వేల 5 వందల కోట్లతో వడ్డీలేని రుణాలు అన్న పెద్దమనిషి.. బడ్జెట్‌లో కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు లోకేష్. జగన్‌ మాట మార్చడం, మడమ తిప్పడం ఇలా ఉంటుందన్న మాట అంటూ ట్వీట్టర్‌లో సెటైర్లు వేశారు. అటు అన్నా క్యాంటీన్ల తొలగింపుపై లోకేష్‌ మండిపడ్డారు. తమపై కక్ష సాధించేందుకు పేదోళ్ల కడుపు కొట్టాలా.. అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆకలికి రాజకీయం తెలియదు ముఖ్యమంత్రి గారూ అంటూ విమర్శలు గుప్పించారు లోకేష్.

Tags

Read MoreRead Less
Next Story