హీరోయిన్‌ కాజల్‌ను పరిచయం చేస్తామంటూ రూ.75 లక్షలు వసూలు

హీరోయిన్‌ కాజల్‌ను పరిచయం చేస్తామంటూ రూ.75 లక్షలు వసూలు
X

సైబర్‌నేరగాళ్ల మోసాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సినిమా హీరోయిన్లను ఎరగా వేసి లక్షలకు, లక్షలు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటిమోసమే చెన్నైలో వెలుగుచూసింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో పాపులర్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్‌ను పరిచయం చేస్తానంటూ.. ఓ బిజినెస్ మెన్ కుమారుడి నుంచి ఏకంగా రూ.75 లక్షలు కొట్టేశారు సైబర్ కిలాడీలు.

ఇంటర్నెట్లో అనుమానాస్పదంగా వచ్చే మెయిల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని పోలీసులు, నిపుణులు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చెన్నైకి చెందిన బిజినెస్‌మెన్ కుమారుడి ఉదంతం కూడా ఇలాంటిదే. చెన్నైలోని రామనాథపురం ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త కుమారుడు కొద్దిరోజుల క్రితం ఇంటర్నెట్‌ వినియోగిస్తుండగా ఓ మెసేజ్ వచ్చింది. మీకు ఆసక్తి ఉంటే నచ్చిన హీరోయిన్‌తో పరిచయం చేయిస్తామన్నది ఆ మెసేజ్ సారాంశం. స్పందించిన ఆ యువకుడు తాను కాజల్‌ను కలవాలని అనుకుంటున్నట్లు రిప్లై ఇచ్చాడు. వారు చెప్పినట్లుగా ఓ బ్యాంకు అకౌంట్‌కు రూ. 50వేలు ట్రాన్స్‌ఫర్ చేసి తన ఫోటో పంపాడు.

ఎన్నిరోజులైన అవతలి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఆన్‌లైన్లో వారిని మళ్లీ సంప్రదించాడు. అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ యువకుడి ఫోటోను మహిళలతో నగ్నంగా ఉన్నట్లు ఎడిట్ చేసి పంపిన దుండగులు వాటిని బయట పెట్టకుండా ఉండాలంటే అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన బాధితుడు మూడు విడతలుగా మొత్తం 75 లక్షలు సమర్పించుకున్నాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో తల్లిదండ్రులు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు డబ్బులు పంపిన ఖాతా శివగంగై జిల్లా దేవకొట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్‌ది అని తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. అప్పుడు అసలు నిందితుడి పేరు బయటకు వచ్చింది. ఈ మాస్టర్ ప్లాన్ వేసి 75 లక్షలు కాజేసిన నిందితుడు శరవణ‌ను చెన్నైలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.9 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన సొమ్మును నిందితుడు క్రికెట్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు తెలిసింది. ఈ కేసుతో ప్రమేయమున్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆ దిశగానూ విచారణ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES