ఏపీలో అన్న క్యాంటీన్ల మూసివేత.. పేదలకు ఆకలి కష్టాలు..

ఏపీలో అన్న క్యాంటీన్ల మూసివేత.. పేదలకు ఆకలి కష్టాలు..

ఐదు రూపాయలకే టిఫిన్. ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం. ఐదు రూపాయలకే రాత్రి భోజనం. ఏ రోడ్డు పక్కనో, చెట్టు కిందో కాకుండా.. గౌరవంగా ఆహారం అందించేందుకు చంద్రబాబు హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఐదు రూపాయలు ఉంటే పేదోడి కడుపు నింపుకునే పథకాన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం డైలామాలో వేసింది. భవిష్యత్తులో అన్న క్యాంటీన్లు కొనసాగుతాయని చెబుతున్నా.. ప్రస్తుతానికి క్యాంటీన్లు మూసివేయటంపై పేదల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

అటు రాజకీయంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అన్న క్యాంటీన్లు మూసివేయడం సరైన నిర్ణయం కాదంటూ సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అన్న క్యాంటీన్‌ వల్ల పేద, మధ్య తరగతి, కార్మిక, కర్షకులకు పట్టెడు అన్నం దొరుకుతుందన్నారు. ఈ రోజుల్లో 5 రూపాయలకే భోజనం పెట్టడం అంటే చాలా గొప్ప విషయమని... దాన్ని కొనసాగించకుండా బంద్ చేయడమేంటని ప్రశ్నించారు.

అన్న క్యాంటీన్లు మూతబడటంతో చాలా ప్రాంతాల్లో పేదలకు ఆకలి కష్టాలు తప్పటం లేదు. ఇక విశాఖలో పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.. నిరుదపేల కడుపు నింపే అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలంటూ ఆందోళనలు చేపడుతున్నారు.

అన్న క్యాంటీన్ల మూసివేతతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పేదలకు ఆకలి కష్టాలు తప్పటం లేదు. దినసరి కూలీలు, ఇతర కార్మిక వర్గాలు 5 రూపాయలకే కడుపునిండా భోజనం చేసే అవకాశం ఉండేదని అంటున్నారు. అన్న క్యాంటీన్ల మూసివేతతో కూలీ డబ్బుల్లో సగం అన్నం, కూరగాయలకే పోతున్నాయని వాపోతున్నారు.

తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల నుంచి కర్నూలులో పని కోసం వచ్చేవారికి కూడా అన్న క్యాంటీన్లు ఆసరగా నిలబడేవి. ఇప్పుడు ఆ అవకాశం లేదని వాపోతున్నారు జనాలు. కూలీలు, చిరుద్యోగులు, వృద్ధులు అన్నా క్యాంటీన్ల దగ్గరికి వచ్చి నిరాశతో తిరిగి వెళ్తున్నారు.

రాష్ట్రంలో ప్రతి పేద వ్యక్తి ఆత్మగౌరవంతో భోజనం చేయాలనే లక్ష్యంతో సేవలు అందిస్తున్న అన్న క్యాంటీన్ల మూసివేతపై టీడీపీ నుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. పేదల కడుపు కొడతారా? అంటూ టీడీపీ విమర్శిస్తోంది. అయితే..ప్రభుత్వం మాత్రం త్వరలోనే సరికొత్తగా క్యాంటీన్లను ప్రారంభిస్తామని అంటోంది.

Tags

Read MoreRead Less
Next Story