తాజా వార్తలు

తెలంగాణలో మరో నాలుగురోజులు వర్షాలు.. భాగ్యనగరాన్ని ముంచెత్తిన ముసురు

తెలంగాణలో మరో నాలుగురోజులు వర్షాలు.. భాగ్యనగరాన్ని ముంచెత్తిన ముసురు
X

తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. విరామం లేకుండా పడుతున్న వర్షాలకు పలు జిల్లాలో చెరువులు,వాగులు జలకళను సంతరించుకున్నాయి. ములుగు జిల్లాలో కుండపోత వర్షాలకు మేడారంలో జంపన్నవాగు ఉప్పొంగుతోంది. పరిసర గ్రామాల్లోని ఇళ్లను కూడా వరద ముంచెత్తింది. పంటపొలాలన్నీ నీటమునిగాయి. ఏటూరు నాగారంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి పొంగిపొర్లుతోంది. జీడివాగు ఉద్ధృతి కారణంగా గోగుపల్లి వద్ద అప్రోచ్‌రోడ్డు తెగిపోయింది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రమనక్కపేటలో వర్షపునీరు ఇళ్లల్లోకి చేరింది.. తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద వరద పెరగడంతో పనులు నిలిచిపోయాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ముంపుగ్రామాల ప్రజలు అవస్థలుపడుతున్నారు.భారీవర్షాలకు పంటలు కూడా నీటి మునిగాయి.

కుమ్రంభీమ్‌ జిల్లా సిర్పూర్ మండలం సిద్ధకుంటలో వరదకు ఓ ఆటో వరదలో కొట్టుకుపోయింది. అయితే ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

భారీర్షాలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తడిసి ముద్దయింది. మహదేవ్‌పూర్‌ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం గోదావరి 9.5 మీట్ల ఎత్తున ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పూర్తి లెవెల్‌ 100 మీటర్లు కాగా.. ప్రస్తుతం 96 మీటర్లకు నీటి మట్టం చేరింది. దీంతో 17 నుంచి 75 వరకు మొత్తం 65 గేట్లను ఎత్తేశారు. మరోవైపు పలిమేల మండలం సర్వాయిపేట వాగు ఉదృతంగా పొంగడంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. బయ్యారం మండలంలో మశివాగు నిండుగా ప్రవహిస్తుండటంతో కంబలపల్లి నుంచి కిష్టాపురం, కచనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక గార్ల మండలంలో భారీ వర్షాలకు రాంపురం చాప్టపై పాకాల ఏరు పొంగిపొర్లుతోంది. ఏరు వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.ఎగురునుంచి జురాలకు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జిల్లా రైతాంగంలో సంతోషం వ్యక్తమవుతోంది. భాగ్యనగరాన్ని ముసురు ముంచెత్తింది. విరామం లేకుండా కురిసిన వర్షానికి రోడ్ల మీద వరద నీరు వచ్చి చేరింది. 24 గంటల్లో నగరంలో 15 మి.మీ. వర్షం కురిసింది. వర్షం కారణంగా జనాలు ట్రాఫిక్‌తో ఇక్కట్లు ఎదుర్కొన్నారు వాహనదారులు.మరోవైపు బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికి అల్పపీడనంగా ఏర్పడే అకాశం ఉంది. దీని ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES