పాక్‌ తీవ్రవాదుల కుట్ర కోడ్‌ను డీకోడ్ చేసిన భారత సైన్యం

పాక్‌ తీవ్రవాదుల కుట్ర కోడ్‌ను డీకోడ్ చేసిన భారత సైన్యం

పాకిస్థాన్ తీవ్రవాదుల కుట్రల కోడ్‌ను మన సైన్యం డీకోడ్ చేసింది. పాక్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ తీవ్రవాద సంస్థ భారీ దాడులకు ప్లాన్ చేసింది. అమర్ నాథ్‌ యాత్రికులు, భద్రతా దళాలే లక్ష్యంగా మారణహోమం సృష్టించడానికి కుట్ర చేసింది. దీంతో అమర్‌నాథ్‌ యాత్రను ప్రభుత్వం నిలిపేసింది. యాత్రికులు తిరిగిరావాలని జమ్మూకాశ్మీర్ గవర్నర్ కార్యాలయం నుంచి సందేశం వెళ్లింది. దాడులకు సంబంధించి నాలుగు రోజుల క్రితమే నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న సైన్యం అప్రమత్తమైంది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే రెండు మార్గాల్లోనూ సైన్యం విస్తృతంగా తనిఖీలు చేసింది. ఇప్పటికే భారీ స్థాయిలో ఆయుధాలు, బాంబులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది మన సైన్యం.

పాక్‌ కేంద్రంగా పనిచేసే తీవ్రవాద సంస్థలకు ఆ దేశ సైన్యం అండగా నిలిచినట్లు తెలిసింది. పాక్ సైన్యం ఆధ్వర్యంలో టెర్రరిస్టులు బోర్డర్ యాక్షన్ టీంలు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇప్పటికే టెర్రరిస్టులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ సమీపానికి చేరినట్లు మన సైన్యం సమాచారం అందుకుంది. ఇక దాడులకు పాల్పడడానికి జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు ఇబ్రహీం అజర్ స్వయంగా రంగంలోకి దిగాడు. ఈ కరడుగట్టిన తీవ్రవాది గత నెల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కనిపించినట్లు సమాచారం అందుకున్నప్పటి నుంచే మన సైన్యం అప్రమత్తమైంది. ఇబ్రహీం అజర్‌... 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC-814 విమానం హైజాక్ కేసులో కీలక పాత్ర పోషించాడు. తన కొడుకు ఎన్‌కౌంటర్‌కు బదులు తీర్చుకోడానికి కాశ్మీర్‌లోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.

ఇబ్రహీం అజర్ మన సైన్యంపై దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. చావో రేవో తేల్చుకుంటానంటూ ఇబ్రహీం చొరబాటుకు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇలాగే చావో రేవో తేల్చుకుంటానంటూ ఇబ్రహీం అజర్ కొడుకు కాశ్మీర్‌లోకి చొరబడ్డాడు. గత ఏడాది అక్టోబర్‌ 30న జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో మన సైన్యం జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. అంతకుముందు మసూద్ అజర్ బావమరిది అబ్దుల్ రషీద్ మన సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. 2017 నవంబర్ 6న పుల్వామాలోని కండి అగ్లర్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అబ్దుల్ రషీద్‌ను మన సైనికులు మట్టుబెట్టారు.

పాక్ టెర్రరిస్టుల కుట్రలను తిప్పికొట్టడానికి మన ఆర్మీ సిద్ధమైంది. కౌంటర్ అటాక్ చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. కాశ్మీర్‌లోకి చొరబడే పెషావర్‌ లాంటి ప్రాంతాలను గుర్తించి తీవ్రవాదుల ఆటకట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కాశ్మీర్‌ వ్యాలీలో చాలాచోట్ల ఆత్మాహూతి దాడులకు ఉగ్రవాదులు పాల్పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వీళ్ల టార్గెట్ ముఖ్యంగా అమర్‌నాథ్ యాత్రికులు, మన ఆర్మీనే. ఇప్పటికే మందుపాతరలను పేల్చే అత్యాధునిక పరికరం IEDని మన సైన్యం సొపొరా ప్రాంతంలో కనిపెట్టి స్వాధీనం చేసుకుంది. అమర్‌నాథ్ యాత్ర మార్గం గుండా తీవ్రవాదులు బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను దాచినట్లు అనుమానిస్తున్నారు. వాటివల్ల యాత్రికులకు ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటికే ప్రభుత్వం యాత్రను నిలిపేసింది.

Tags

Read MoreRead Less
Next Story