సాహో పోలీస్ : ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన ఎస్సై..

సాహో పోలీస్ : ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన ఎస్సై..

రికార్డ్ స్థాయిలో కురుస్తున్న వర్షాలు వడోదరను వణికిస్తున్నాయి. గత మూడు రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విశ్వమైత్రి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరుతుండటంతో ఇళ్లు, అపార్టుమెంట్లు, షాపులు, రోడ్లు అన్నీ నీట మునిగాయి. వర్షాల కారణంగా ఏడుగురు చనిపోయారు.

రికార్డ్ స్థాయి వర్షాలతో వడోదరలోని రహదారులు నీటిమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నడుములోతు కంటే ఎక్కుగా నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 5,700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 138 మందిని ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. జలమయమైన ప్రాంతాల నుంచి NDRF, ఎయిర్‌ఫోర్స్‌ దళాలు ప్రజలను ఖాళీ చేయిస్తున్నాయి. వరదలతో నగరంలోకి కొట్టుకొచ్చిన మూడు మొసళ్లను ఫారెస్ట్‌ అధికారులు పట్టుకున్నారు.

దేవీపురలో పీకల వరకు నీరు నిలిచిపోయింది. దీంతో పసిపాపతో సాయం కోసం ఎదురుచూస్తున్న మహిళను పోలీసులు రక్షించారు. ఎస్సై గోవింద చద్వా పాపను ఓ టబ్‌లో పడుకోబెట్టుకొని తలపై ఆమెను మోసుకుంటూ తీసుకువచ్చారు. వరదలో కిలోమీటరున్నర దూరం నడిచి పాపను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. దీంతో ఎస్సైపై ప్రశంసలు కురుస్తున్నాయి.

వరదల కారణంగా రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. అనేక రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారిమళ్లించారు. వడోదర విమానాశ్రయాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. రైల్వేస్టేషన్ల పరిసరాలు, రైలు పట్టాల పై భారీగా వరద నీరు చేరడంతో 22 రైళ్లను రద్దు చేశారు. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో ఆ ప్రభావం నేరుగా నిత్యావసరాలపై పడింది. అర లీటర్‌ పాలు 40 రూపాయలు పలుకుతోంది. కూరగాయల ధరలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని సమీక్షించారు. గుజరాత్‌కు వర్షం గండం ఇంకా తప్పలేదు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story