ఏపీకి మరో వరుణ గండం..

ఏపీకి మరో వరుణ గండం..

ఏపీని చినుకు వణుకు పుట్టిస్తుంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక గోదావరికి వరద పోటెత్తడంతో ఉభయగోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తూ ఊళ్లను, ముంపు గ్రామాలను ముంచెత్తింది. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతుండడంతో గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంక గ్రామాల పంటభూములు గోదావరిలో కలిసిపోయాయి.

పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు భారీవర్షాలకు ముద్దయ్యాయి. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో వానలు భారీగా కురుస్తున్నాయి. కొండ వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాగుల ఉధృతికి ఏజెన్సీలోని జల్లేరు, బైనేరు, సుద్దవాగు, జైహింద్‌కాలువ, రేగులకుంట కాలువతోపాటు పలు వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు జనం.

తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల్లోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. వర్షాల కారణంగా వాగులు పొంగి వరద నీరు రోడ్లపైకి చేరుకుంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒక పక్క శబరి, మరోపక్క గోదావరి ఈ రెండు నదుల ప్రవాహంతో విలీన మండలాల్లోని కూనవరం ఉక్కిరిబిక్కిరవుతోంది. భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది సాగరసంగమం వద్ద సముద్రం ముందుకు చొచ్చుకువస్తోంది. సముద్రం దాదాపు వంద మీటర్లు ముందుకు చొచ్చుకురావడంతో జనంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. స్పిల్‌వే వైపు వరద పోటెత్తుతోంది. కాఫర్‌ డ్యామ్‌ ఎఫెక్ట్‌తో ముంపు గ్రామాలకు ముప్పు తప్పదనే హెచ్చరికలతో అధికారులు వరదను స్పిల్‌వే మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో రెండు లక్షల క్యూసెక్కుల నీరు స్పిల్‌వే రివర్స్‌ స్లూయిజ్‌ గేట్ల ద్వారా దిగువకు పంపిస్తున్నారు. స్పిల్‌వే గేట్ల క్లస్టర్‌ లెవెల్‌ ఎత్తు 25.72 మీటర్లుకాగా.. దాదాపుగా అంతే స్థాయికి నీటి ప్రవాహం చేరుకుంది. మరో అరమీటరు ఎత్తు పెరిగితే స్పిల్‌వే గేట్ల ద్వారా నీరు దిగువకు ప్రవహించనుంది.

ఏపీకి మరోవరుణ గండం పొంచి ఉంది. బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి 4వ తేదీ నాటికి ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అకాశం ఉంది. దీనిప్రభావంతో ఏపీలో మోస్తారు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. తీరం వెంబడి గంటలకు 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు చేపట వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. జలాశయానికి ఇన్ ఫ్లో 1.98 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుత నీటిమట్టం 836 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 57 టీఎంసీలుగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story