తప్పతాగి కారు నడిపి.. జర్నలిస్ట్ ప్రాణాలు తీసిన ఐఏఎస్ అధికారి

మద్యం మత్తు మనుషుల ప్రాణాలు తీస్తుంది. కేరళలోని తిరువనంతపురంలో బైక్‌పై వెళుతున్న ఓ జర్నలిస్ట్‌ని ఐఏఎస్ ఆఫీసర్ కారు ఢీకొట్టింది. దీంతో 35 ఏళ్ల జర్నలిస్ట్ అక్కడికక్కడే మృతిచెందాడు. మళయాళ దినపత్రిక సిరాజ్‌లో అతడు పనిచేస్తున్నాడు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న అధికారి కారు జర్నలిస్ట్ బైకుని ఢీకొట్టింది. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా పోలీసులు కారుని ఎవరు డ్రైవ్ చేసింది నిర్ధారించారు. ల్యాండ్ సర్వే డైరక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ శ్రీరామ్ వెంకటరామన్ కారు నడిపినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అధికారి మద్యం సేవించిన కారణంగా కారుని స్పీడ్‌గా డ్రైవ్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో ఆయనతో పాటు మహిళ కూడా ఉన్నట్లు గుర్తించారు. కాగా, పోలీసులు ముందు అధికారి కారు నడపలేదన్నారు. కానీ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు ఆటో డ్రైవర్లు ప్రమాదానికి కారణం ఐఏఎస్ అధికారి అని చెప్పారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి అధికారి తప్పిదం అని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com