తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు.. మరో మూడు రోజులు..

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు.. మరో మూడు రోజులు..

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవార్తనం కొనసాగుతుండడంతో.. ఏపీ, తెలంగాణల్లో మరో రెండు రోజులు పాటు అతి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.. ఏపీ, తెలంగాణల్లో గత పది రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాలకు తోడు... ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నదులు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అన్ని ప్రాజెక్టులకు జలకళ చేకూరింది. ఇక గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పరిసర గ్రామాల్లో భారీ వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది.

ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఇది మరింత తీవ్రంగా మారే అవకాశముందని వాతావారణశాఖ హెచ్చరించింది. దీంతో ఈ నెల 5, 6 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు సుమారు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలోని వర్షాలు జోరుగా కురుస్తుండడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జోరు వానలు ముంచెత్తాయి. గోదావరి నది వరద ప్రవాహం పెరుగుతుండటంతో తీర ప్రాంత గిరిజనం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పోలవరం నిర్వాసిత దేవీపట్నం మండలంతో పాటు విలీన మండలాలు నాలుగింటిలో గిరిజనులు కుంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు.

తెలంగాణలోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం- జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కిన్నెరసాని నదికి 12 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద గోదావరి 38 అడుగులకు చేరుకుంది. ములుగు జిల్లాలో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు ఉగ్రరూపం దాల్చాయి. భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం గోదావరి వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరిది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంకో ఐదు అడుగులు పెరిగి 48కి చేరితే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story