కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించడానికి కారణం ఏంటి?

కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించడానికి కారణం ఏంటి?
X

అసలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35A ప్రత్యేకతలేంటి?కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించడానికి కారణం ఏంటి? ఒకసారి చూద్దాం. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం కోసం రాజ్యాంగంలో చేర్చిందే ఆర్టికల్‌ 370. 1947 అక్టోబరు 26న కశ్మీర్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశారు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు అనే మూడు అంశాలకే ఈ విలీనం పరిమితమైంది. విలీనం తుది విధి విధానాలు అప్పటికింకా ఖరారు కాలేదు. వీటిపై 1949 జులైలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత షేక్‌ అబ్దుల్లా భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించారు. పర్యవసానంగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం రక్షణ, విదేశీ, ఆర్థిక, కమ్యూనికేషన్‌ వ్యవహారాలు తప్ప మిగతా వాటిలో కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఇతర చట్టాల్ని అమలుచేయాలంటే రాష్ట్ర అంగీకారాన్ని తప్పనిసరిగా పార్లమెంటు తీసుకోవాల్సి ఉంటుంది. పౌరసత్వం, ఆస్తిపై హక్కు, ప్రాథమిక హక్కుల విషయంలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు భూముల్ని కొనలేరు. ఆర్టికల్‌ 360 కింద రాష్ట్రంలో కేంద్రం ఆర్థిక ఎమర్జెన్సీని విధించలేదు.

ఇక ఆర్టికల్‌ 35A అనేది జమ్మూకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది. జమ్మూకశ్మీర్‌ శాశ్వత నివాసి ఎవరు? అన్న దానిని నిర్వచిస్తుంది. వారి స్థిరాస్తి హక్కుల్ని నిర్ధారిస్తుంది. 1954 మే 14వ తేదీకన్నా ముందు లేదా ఆ తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి లేదా, పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి ..కశ్మీర్‌ శాశ్వత నివాసి అవుతాడు. ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతర సహాయాల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందొచ్చు. దీర్ఘకాలం రాష్ట్రంలో నివసిస్తున్న వారికి సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయొచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఆర్టికల్‌ 35ఏ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చొచ్చు. కశ్మీరీ మహిళ కశ్మీరేతరుణ్ని పెళ్లిచేసుకుంటే మాత్రం- ఆమె ఈ రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండటానికి వీల్లేదు. ఆమె పిల్లలకూ ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శాశ్వత నివాస సర్టిఫికెట్‌ను ఇవ్వరు. ఈ నిబంధన చట్టవ్యతిరేకమని 2002లో జమ్ముకశ్మీర్‌ హైకోర్టు ప్రకటించింది. కశ్మీరేతరుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాకూడదని 1956 నవంబరు 17న ఆమోదించిన రాష్ట్ర రాజ్యాంగం చెబుతోంది.

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత షేక్‌ అబ్దుల్లా, ప్రధాని నెహ్రూ మధ్య 1952 జులైలో కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం కశ్మీరీలందరికీ భారత పౌరసత్వం ఇస్తారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించడం కోసం చట్టాలు చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుంది. ఈ నిబంధనల్నే 1954 మే 14న రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్‌ 35ఏ కింద చేర్చారు. అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

Next Story

RELATED STORIES