రాజ్యాంగాన్ని బీజేపీ హత్య చేసింది: గులాంనబీ ఆజాద్‌

రాజ్యాంగాన్ని బీజేపీ హత్య చేసింది: గులాంనబీ ఆజాద్‌
X

జమ్ము కశ్మీర్‌పై మోదీ మదిలో ఏముందో స్పష్టత వచ్చింది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 370, 35A రద్దుకు కేంద్రం బిల్లు పెట్టింది. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతకంటే ముందు.. కశ్మీర్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణంపై చర్చ జరపాలని ప్రతిపక్ష నేత ఆజాద్ డిమాండ్ చేశారు. "కశ్మీర్‌ కోసం చాలా మంది రాజకీయ నాయకులు, సైనికులు, ప్రాణాలను త్యాగం చేశారు. ఇది చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను నేను ఖండిస్తున్నాను. రాజ్యాంగాన్ని బీజేపీ హత్య చేసింది" అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ మండిపడ్డారు. ఏమాత్రం సమాచారం లేకుండా బిల్లు పెట్టడం ఏంటని విపక్షాలు నిలదీశాయి. దీనిపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు స్పష్టత ఇచ్చారు. అత్యవసరమైన బిల్లుగా హోంమంత్రి అమిత్‌షా చెప్పారని.. సభాపతిగా తన విచక్షణ మేరకు బిల్లు ప్రవేశ పెట్టేందుకు అనుమతించానని అన్నారు. దీనిపై చర్చకు విపక్షాలకు కావలసినంత సమయం ఇస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమైన అంశం కాబట్టి.. వివరంగా చర్చిద్దామని వెంకయ్య అన్నారు. అయినా విపక్షాలు వెనక్కు తగ్గకపోవడంతో.. అరుపులు, కేకల మధ్యే అమిత్‌షా బిల్లు ప్రవేశపెట్టారు.

Next Story

RELATED STORIES