జమ్మూకశ్మీర్‌లో బలగాల మోహరింపు వెనుక కారణమదేనా..?

జమ్మూకశ్మీర్‌లో  బలగాల మోహరింపు వెనుక కారణమదేనా..?

జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం వైఖరి ఇవాళ తెలిసిపోతుందా? రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. క్షణక్షణం ఉత్కంఠ రాజేస్తున్నాయి. అదనపు బలగాల మోహరింపు, భద్రత టైట్‌ చేయడంపై దేశమంతా చర్చ జరుగుతోంది. అయితే.. జమ్మూ కశ్మీర్‌లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కశ్మీర్‌లో పరిస్థితులపై ఆదివారం అత్యున్నత స్ధాయి సమావేశం నిర్వహించారాయన. రా, ఐబీ చీఫ్‌లు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవాల్ వంటి వారితో షా చర్చించారు. మరోవైపు.. ఇవాళ కేంద్ర కేబినెట్ కూడా ఇవాళ సమావేశం కాబోతోంది. షెడ్యూల్ ప్రకారం బుధవారం భేటీ కావాల్సి ఉన్నా.. రెండు రోజులు ముందే మంత్రివర్గం సమావేశం అవుతోంది. కశ్మీర్‌ అంశంపైనే ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. ఇటు కేబినెట్ భేటీ.. అటు కోటా బిల్లు నేపథ్యంలో.. కశ్మీర్‌పై కేంద్ర వైఖరి స్పష్టం అవుతుందని భావిస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మరింత వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. వారిని గడప దాటనివ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. అటు శాంతంగా ఉండాలని ప్రజలకు ఓ ట్వీట్‌ ద్వారా ఒమర్‌ విజ్ఞప్తి చేశారు. ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలి అంటూ అటు మెహబూబా ట్వీట్‌ చేశారు. తమను పోలీసులు అరెస్టు చేశారని కాంగ్రెస్‌ నేత ఉస్మాన్‌ మాజిద్‌, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామి పేర్కొన్నారు.. మరోవైపు, జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కశ్మీర్‌ ఐజీలతో గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

మరో వైపు.. జమ్మూ-కశ్మీరు, లడఖ్‌ల ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్రతిపత్తిని, గుర్తింపును కాపాడుకుంటామని అఖిల పక్షం నేతలు స్పష్టం చేశారు.. ఈ లక్ష్యం కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చినట్లు తెలిపారు. దీని కోసం ఎటువంటి దాడులనైనా ఎదుర్కొనాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఫరూక్‌ నివాసంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి సమావేశమై.. తాజా రాజకీయ పరిస్థితులు, పెద్దఎత్తున సైనిక బలగాలను మోహరించడంపై చర్చించిచారు. భారత్‌, పాకిస్థాన్‌ లు కశ్మీర్‌ విషయంలో అచితూచి వ్యవహరించాలని, లేకుంటే కశ్మీర్‌లోయలో ఉత్పన్నమయ్యే పరిణామాలు ఊహకు కూడా అందవని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. అమర్‌నాథ్‌ యాత్రను అర్థంతరంగా నిలిపివేయటం ఇంతకు ముందెప్పుడు జరగలేదని దీనిపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు తెలియజేయాలని అన్ని పార్టీలు కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకునట్లు ఆయన వెల్లడించారు.

అటు భారత రాజ్యాంగంలోని అధికరణ 370, అధికరణ 35ఏలను రద్దు చేయడమంటే దురాక్రమణకు తెగించినట్లేనని హెచ్చరించారు మాజీ సీఎం, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ. కేంద్రం వైఖరిపై ప్రశ్నిస్తే అవినీతికి పాల్పడ్డరంటూ తమపై నెపం మోపి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో కక్ష తీర్చుకుంటున్నారని విమర్శించారు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే ప్రజలు అగ్రహావేశాలను కేంద్రం చూడాల్సి ఉంటుందన్నారు. యుద్ధవాతావరణాన్ని సృష్టించకుండా కశ్మీర్‌లో శాంతి స్థాపనకు కృషి చేయాలని ఆమె కోరారు. నియంత్రణారేఖ వద్ద కూడా తాజా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని ఆమె తెలిపారు.అయితే కశ్మీరులో ప్రస్తుత పరిస్థితికి కారణమైన ఉగ్రవాదంపై కానీ.. పాకిస్థాన్‌ దుర్శర్యలపై కానీ ఈ జమ్మూ-కశ్మీరు రాజకీయ పార్టీలు విమర్శకపోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story