ఇక వాళ్ళు రాళ్ళు రువ్వడం ఆపి ఉద్యోగాలు చేసుకుంటారు

ఇక వాళ్ళు రాళ్ళు రువ్వడం ఆపి ఉద్యోగాలు చేసుకుంటారు

కోట్లాదిమంది ప్రజల కలలను నెరవేరుస్తూ జమ్మూకశ్మీర్ రాష్ట్రం సంపూర్ణంగా భారతదేశంలో విలీనమైంది. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌పై కేంద్రానికి సంపూర్ణ హక్కులు లభించాయి. ఈ ఆర్టికల్‌ రద్దుతో.. జమ్ముకశ్మీర్‌లో కొత్త శకం ప్రారంభమవుతుందన్నారు హోంమంత్రి అమిత్‌షా. యువత ఉగ్రవాదంవైపు నుంచి...అభివృద్ధివైపు నడుస్తుందన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దుతోపాటు జమ్మూకశ్మీర్‌ విభజిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది మోదీ సర్కారు.ఈ మేరకు రాజ్యసభలో ప్రకటన చేశారు హోంమంత్రి అమిత్‌షా. దీంతో కశ్మీర్ స్వయంప్రతిపత్తి, శాశ్వత హక్కు లు తొలగిపోయాయి. అంతేకాదు.. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కూడా రద్దైంది. శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌ అవతరించగా, అసెంబ్లీ లేకుండా లఢాక్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. కశ్మీర్‌లో టెర్రరిజం పోవాలంటే ఆర్టికల్‌ 370 రద్దు తప్పనిసరన్నారు హోంమంత్రి అమిత్‌ షా. కశ్మీర్‌ యువతకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమన్నారాయన. జమ్ముకశ్మీర్‌లో రిజర్వేషన్లు, తదితర బిల్లులపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జమ్మూకశ్మీర్‌లో రక్తపాతానికి కారణమైన 370 ఆర్టికల్ కథ ముగిసిందన్నారు అమిత్‌షా . ఈ ఆర్టికల్‌తో ఎలాంటి నష్టాలు వస్తాయో జనసంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు కానీ..ఈ నిజాల్ని ఇన్నాళ్లు దాచిపెట్టారంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు. 370 రద్దుతో ప్రపంచమే మునుగుతుందన్నట్లుగా విపక్షాలు ఆందోళన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికీ సరైన విద్యావకాశాలు లేక కశ్మీర్‌ యువత ఉగ్రవాదవైపు వెళ్తోందన్నారు. దీనికంతటికీ కారణం ఆర్టికల్‌ 370 అని అన్నారు అమిత్‌షా....

పాక్‌ కుట్ర పూరితంగా సాగించిన చర్యలకు కశ్మీరీ యువత బలైందన్నారు అమిత్‌షా. ఆర్టికల్‌ 370 ఉన్నంత వరకు కశ్మీరీ యువత.... భారత్‌లో కలవదని జియావుల్‌హక్‌ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. వేర్పాటు వాదుల పిల్లలంతా అమెరికా, ఇంగ్లండ్‌లో చదువుకుంటుంటే .... 370 ఆర్టికల్‌ కోసం పోరాడే వాళ్ల పిల్లలు మాత్రం .. ఉగ్రవాదులుగా మారుతున్నారన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు పోవాలంటే ఆర్టికల్‌ 370 రద్దు తప్పదన్నారు 370 ఆర్టికల్‌ రద్దు అనేది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు ఆయన. 1950 తర్వాత తమ పార్టీ ప్రతి మేనిఫెస్టోలో దీని గురించి చెప్పామన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ ఈ ఆర్టికల్‌ను కదిపే సాహసం చేయలేదన్నారు. ఒక తాత్కాలిక ఆర్టికల్‌ను ఎన్నాళ్లు కొనసాగిస్తారని ప్రశ్నించారు.

పటేల్‌ విలీనం చేసిన సంస్థానాలన్నీ ఇవాళ భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయని... కానీ. ఆ సంస్థానాల్లో ఎక్కడా 370 అధికరణలు అమల్లో లేవన్నారు . ఆర్టికల్‌ 370 వల్లే కశ్మీర్‌ విలీనం జరిగిందన్న వాదన సరికాదన్నారు. 370 లేకుంటే భారత్‌ నుంచి జమ్ముకశ్మీర్‌ విడిపోతుందన్న వాదనలో ఏ మాత్రం నిజం లేదన్నారు. దేశం గురించి నిర్ణయాలు తీసుకోవాలంటే సాహసం కావాలన్న అమిత్‌షా ... . ఆ ధైర్యం ప్రధాని మోదీకి ఉందన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. జమ్మూకశ్మీర్లో ఎప్పుడు సాధారణ పరిస్థితి వస్తుందో అప్పటి వరకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందన్నారు. సమస్య పరిష్కారానికి ఆర్టికల్‌ 370 రద్దు తప్పనిసరన్నారు.

Tags

Read MoreRead Less
Next Story