కశ్మీర్‌ వ్యవస్థీకరణ, రిజర్వేషన్‌ బిల్లులపై లోక్‌సభలో చర్చ

కశ్మీర్‌ వ్యవస్థీకరణ, రిజర్వేషన్‌ బిల్లులపై లోక్‌సభలో చర్చ

జమ్ము కశ్మీర్‌ విభజన్‌పై లోక్‌సభలో గందరగోళం మొదలైంది. 370 రద్దు తీర్మానం పంచాయితీ ఇప్పుడు లోక్‌సభకు చేరింది. జమ్ము కశ్మీర్‌ వ్యవస్థీకరణ బిల్లు, రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ చేపట్టేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నా.. కాంగ్రెస్‌, ఎంఐఎం, డీఎంకే, కశ్మీర్‌లో ప్రధాన పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ సభ్యుల బలం ప్రకారం బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే అయినా.. వివిధ పార్టీల ఆందోళనలతో సభలో రచ్చ మొదలైంది.. మరోవైపు ఇదే అంశంపై రేపు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ కొనసాగుతోంది. శ్రీనగర్‌తో పాటు జమ్మూ, రెశాయ్‌, దోడా జిల్లాల్లో నిషేధాజ్ఞలు అమలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా అదనపు బలగాలను మోహరించాయి.

పాకిస్తాన్‌ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావించిన కేంద్రం, పీఓకేలో భారీగా సైన్యాన్ని మోహరించింది. పాక్‌ నుంచి వచ్చే ఏ ప్రతిచర్యనైనా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉంది. ఆర్మీ ప్రధానాధికారులంతా జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కేంద్రం సైన్యానికి పూర్తి​ స్వేచ్ఛనిచ్చింది. కశ్మీర్‌ లోయలో పాక్‌ హింసకు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు, పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా, సజ్జాద్‌ లోన్‌తో సహా వేర్పాటువాదులనంతా ఇంకా గృహనిర్భంధంలోనే ఉంచారు. ఇంటర్‌నెట్‌, కమ్యూనికేషన్‌ సర్వీసులు రద్దు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. జమ్ముకశ్మీర్‌ వ్యవస్థీకరణ బిల్లు పూర్తిగా చట్టంగా మారేవరకు ఎవరూ సంబరాలు నిర్వహించరాదని బీజేపీ అధిష్టానం ఆదేశించింది.

ఇటు కశ్మీర్‌ విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఐరాసలోని శాశ్వత సభ్య దేశాలకు తెలియజేసింది. ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌, రష్యా, చైనా రాయబారులకు కశ్మీర్‌పై పార్లమెంటులో జరగబోయే పరిణామాలను వివరించారు. కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌ అంతర్గత విషయం అయినప్పటికీ.. ఆయా దేశాల ఆసక్తి మేరకు ఈ అంశంపై వారికి వివరించినట్లు తెలిపారు. దీనిపై అమెరికా కూడా స్పందించింది. నియంత్రణ రేఖ వెంబడి భాగస్వామ్య పక్షాలన్నీ శాంతి, సుస్థిరతలకు కృషి చేయాలని అమెరికా సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story