అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారి విచారణ

అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారి విచారణ

అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారి విచారణ ప్రారంభమైంది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి ఎవ్వరికి చెందుతుందో తేల్చే పనిలో సుప్రీంకోర్టులో నిమగ్నమైం ది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాస నం, బాబ్రీమసీదు-రామజన్మభూమి వివాదంపై విచారణ చేపట్టింది. తొలి రోజు నిర్మోహీ అఖాడా తరపు వాదనలు నమోదు చేశారు. అఖాడా తరఫున సుశీల్ కుమార్ జైన్ వాదనలు వినిపించారు. వివాదాస్పద రామ‌జన్మభూమి ప్రాంతం ఎప్పటి నుంచో త‌మ ఆధీనంలో ఉందని నిర్మోహీ అఖాడా పేర్కొంది. అయోధ్య ఆవ‌ర‌ణ‌లో ఉన్న సీతా ర‌సోయి, చాబుత్రా, భండార్ ఘ‌ర్ లాంటి ప్రాంతాలు త‌మ ఆధీనంలోనే ఉన్నాయని వెల్లడించింది. శ్రీరాముడు జన్మించిన ప్రాంతంగా పేర్కొంటున్న భూభాగం కూడా తమ స్వాధీనంలోనే ఉందని తెలిపింది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్‌కి కూడా తాము ఆశ్రయం కల్పించామని తెలిపింది. బ్రిటిషర్లతో యుద్ధం తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయ్, అయోధ్యకు రాగా తామే రక్షణ ఇచ్చామని పేర్కొంది. 1934 నుంచి ఆ భూభా గంలోకి ముస్లింల‌ను అనుమ‌తించ‌డం లేద‌ని వివరించింది. ప్రార్థనలు, నమాజ్ చేయని స్థలాన్ని మసీదుగా పరిగణించబోరని వాదించింది.

నిర్మోహి అఖాడా వాదనలపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. 1934కు ముందు వివాదాస్పద ప్రాంతంలో ముస్లింలు ప్రార్థనలు చేసేవారంటూ అలహాబాద్ హైకోర్టు చెప్పిన విషయాలను గుర్తు చేసింది. వివాదాస్పద ప్రాంతంలో రామాలయ ఉనికికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని సూచించింది. అక్కడ సీతారాముల విగ్రహాలు ఉండేవ ని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ అలహాబాద్ హైకోర్ట్ పేర్కొన్న విషయాన్ని సుప్రీంకోర్ట్ ఉటంకించింది. 1992నాటి విధ్వంసంతో ఆలయం దెబ్బతిందని నిర్మోహీ అఖాడా బదులిచ్చింది. వివాదాస్పద భూభాగంపై సంపూర్ణ యాజమాన్య హక్కులను తమకే కట్టబెట్టాలని విజ్ఞప్తి చేసింది.

దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య వివాదానికి పరిష్కారం కనుగొనడానికి సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. జస్టిస్ ఖలీఫుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరామ్ పంచూలతో కూడిన త్రిసభ్య కమిటీ మధ్యవర్తిత్వం చేయించింది. ఐతే, మధ్యవర్తిత్వం విఫలమైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన సుప్రీంకోర్టు, రోజువారి విచారణ చేపట్టింది. అలహాబా ద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన 14 పిటిషన్లపై ఒక్కొక్కరి వాదనలు నమోదు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story