Top

కశ్మీర్ విభజన బిల్లులకు భారీ మెజార్టీతో ఆమోదం తెలిపిన లోక్‌సభ

కశ్మీర్ విభజన బిల్లులకు భారీ మెజార్టీతో ఆమోదం తెలిపిన లోక్‌సభ
X

జమ్మూ కశ్మీర్ విభజన బిల్లులకు భారత పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే ఈ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలపగా, తాజాగా లోక్‌సభ కూడా ఆమోదం తెలిపింది. కశ్మీర్ విభజన బిల్లులను సోమవారమే లోక్‌సభలో ప్రవేశపెట్టగా, మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్రహోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభించగా, కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ, టీఆర్ఎస్, టీడీపీ, కశ్మీరీ పార్టీలకు చెందిన సభ్యులు మాట్లాడారు. ఎంపీల విమర్శలు, ఆరోపణలు, అభిప్రాయాల అనంతరం అమిత్ షా సమాధానమిచ్చారు. హోంమంత్రి సమాధానం అనంతరం సభలో ఓటింగ్ జరిగింది. కశ్మీర్ విభజన బిల్లులకు భారీ మెజార్టీతో లోక్‌సభ ఆమోదించింది. ఓటింగ్‌లో 433 మంది సభ్యులు పాల్గొనగా బిల్లుకు అనుకూలంగా 367 ఓట్లు వచ్చాయి. 67 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. ఒక ఎంపీ తటస్థంగా ఉన్నారు.

కశ్మీర్ విభజన బిల్లులు ఆమోదం పొందడంతో కమలదళంలో సంతోషం పొంగిపొర్లింది. భారీ మెజార్టీతో బిల్లులు నెగ్గడంతో బీజేపీ ఎంపీలు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశా రు. బిల్లు విషయంలో కీలకంగా వ్యవహరించిన అమిత్ షాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. అంతకుముందు, కశ్మీర్ విభజన బిల్లులపై సభ దద్దరిల్లింది. ఆర్టికల్-370, ఆర్టికల్-35A రద్దుతో జమ్మూకశ్మీర్‌కు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. దశాబ్దాల సమస్యకు ఇప్పటికైనా ముగింపు పలకడానికి సహకరించాలని కోరారు. ఐతే, కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకు పడింది. కశ్మీర్ విషయంలో మోదీ సర్కారు దూకుడుగా వ్యవహరిస్తుందని మండిపడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీలు, అమిత్ షా మధ్య మాటల తూటాలు పేలాయి.

ఆర్టికల్-370 రద్దు రాజ్యాంగ విరుద్దమని MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా విమర్శించారు. కశ్మీరీల మనోభావాలను మోదీ సర్కారు దెబ్బతీసిందని దుయ్యబట్టారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్‌లో రెండు కుటుంబాలకు తప్ప ఇంకెవరికీ నష్టం లేదన్నారూ లఢాఖ్ ఎంపీ జామ్యాంగ్‌ నాంగ్యాల్‌. మోదీ సర్కారు నిర్ణయాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారని చెప్పారు.

సుదీర్ఘ చర్చ అనంతరం అమిత్ షా సమాధానమిచ్చారు. ఆర్టికల్-370 రద్దుతో జమ్మూకశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగమైందన్నారు. జమ్మూకశ్మీర్‌కు కేంద్రపాలిత ప్రాంత హోదా శాశ్వతంగా ఉండదని పునరుద్ఘాటించారు. శాంతి నెలకొనగానే రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్ విభజన బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. మోదీ, సభకు రాగానే బీజేపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. వందేమాతరమ్, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. విభజన బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో జమ్మూకశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడింది. శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్ ఆవిర్భవించింది. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లఢాఖ్ ఏర్పడింది.

Next Story

RELATED STORIES