పాకిస్థాన్‌ వెన్నులో వణుకు

పాకిస్థాన్‌ వెన్నులో వణుకు
X

జమ్మూకశ్మీర్‌ అంశంలో అంతర్జాతీయ వేదికలపై ఎన్నిసార్లు తలబొప్పి కట్టినా పాక్‌ తన ధోరణి మార్చుకోవడం లేదు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అభాసుపాలవుతోంది. ఇప్పుడు మరోసారి... ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజనపై పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ విద్వేషపూరితమైన ప్రకటనలు చేసింది. అంతేకాదు.. దీనిపై చర్చించేందుకు ఇవాళ ఆ దేశ పార్లమెంట్‌ అత్యవసరంగా సమావేశమవుతోంది.

జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుపై వణికిపోతోంది పాకిస్థాన్ . జమ్మూకశ్మీర్‌ విషయంలో పాక్‌కు ఏ మాత్రం సంబంధం లేదు. 370 రద్దు రాజ్యాంగం ప్రకారమే జరిగినా.. దాయాదీ దేశం మాత్రం విద్వేషపూరితమైన ప్రకటనలు చేస్తూ తన వక్రబుద్దిని చూపిస్తోంది. స్వయం ప్రతిపత్తి రద్దుతో ఏదో జరిగిపోతోందంటూ అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టిస్తోంది. కశ్మీర్‌ ఒక అంతర్జాతీయ వివాదమని, అందులో తాము భాగస్వామిగా ఉన్నామంటోంది. భారత్‌ చట్టవ్యతిరేక చర్యల నియంత్రణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. కశ్మీరీల ప్రయోజనాల పరిరక్షణకు పాక్‌ కట్టుబడి ఉందని పేర్కొంది.

అంతేకాదు... ఒక అడుగు ముందుకు వేసిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌... కశ్మీర్‌ విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలంటూ వితండ వాదన తీసుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దును ఖండించిన ఇమ్రాన్‌... భార‌త్‌ నిర్ణయంతో వివాదాస్పద ప్రాంతాన్ని మరింత జటిలం చేసిందంటూ మొసలి కన్నీరు పెట్టారు. ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుపై చర్చించేందుకు ఏకంగా ఇవాళ పార్లమెంట్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ...

ఇన్ని రోజులు స్థానిక జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం ఉదాసీనతతో రెచ్చిపోయిన పాక్‌.. ఆర్టికల్‌ 370 రద్దుతో బెంబేలెత్తిపోతోంది. ఆర్టికల్‌ 370లోని బలహీనతలే అదనుగా మార్చుకున్న దాయాది దేశం... . చేయరాని అరాచకాలను చేసింది. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని రావణకాష్టం చేసింది. ఉగ్రవాదుల్ని ఎగదోసింది. వేర్పాటువాదుల్ని ప్రోత్సహించింది. ఒకటేమిటి భారత్‌కు పక్కలో బల్లెంలా తయారైంది పాక్‌. ఇది గ్రహించిన మోడీ సర్కారు.. ఆర్టికల్‌ 370 రద్దుతో పాక్‌కు కోలుకోని దెబ్బ కొట్టింది. దీంతో పాకిస్థాన్‌కు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కశ్మీర్‌ మొత్తం భారత్‌ ఆధీనంలోకి వెళ్తే ఇక తమ ఆటలు సాగవని భయపడిపోతోంది. అంతే కాదు ఎక్కడ తాను ఆక్రమించుకున్న పీఓకేపై మోడీ సర్కారు గురి పెడుతుందోనన్న భయం దాయాది దేశాన్ని వెంటాడుతోంది. అందుకే... ఈ అంశంపై విధ్వేషపూర్తిత ప్రకటన చేస్తూ ఇప్పటికీ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది పాక్‌ ప్రభుత్వం. లేని పెద్దరికాన్ని నెత్తిపెట్టుకుని.... ఈ అంశాన్ని చర్చించేందుకు ఇవాళ పార్లమెంట్‌ అత్యవసరంగా సమావేశమాన్ని ఏర్పాటు చేసింది.

Next Story

RELATED STORIES