జోరుగా కురుస్తున్న వానలు.. పొంగిపొర్లుతున్న నదులు

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో విలీన మండలాల్లో జనజీవనం స్తంభించింది. వీఆర్‌పురం, చింతూరు మండలాల మధ్యలో దాదాపు 30 గ్రామాలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి. అయితే రాబోయే వరదను దృష్టిలో ఉంచుకొని శ్రీరామగిరి, చింతరేవులపల్లి గ్రామాల దగ్గర SDRF బృందాలను మోహరించారు. చింతరేవులపల్లి గ్రామంలో యటపాక డీఎస్పీ జేవీ సంతోష్ తన సిబ్బందితో కలిసి నిత్యావసర వస్తువులు అందించారు. రేకపల్లి ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీలను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు.

మరోవైపు అధికారులు తమను పట్టించుకోవడం లేదని చింతూరు మండలంలోని వరద బాధితులంటున్నారు. చుట్టూ ఎటు చూసినా నీరే కనిపిస్తోందని, రాత్రి వేళల్లో కరెంట్ పోతే చాలా ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. కిరోసిన్ దీపాలు అందజేయాలని కోరుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగుతోంది. ప్రవాహం 43 అడుగులు దాటి ప్రవహిస్తుండడంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story