కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి!

కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి!

జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి బిల్లు తొలగింపు సందర్భంగా సుష్మ.. ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు అభినందనలు తెలుపుతూ చివరి ట్వీట్ చేశారు. తన జీవితకాలంలో ఇలాంటి రోజు కోసం ఎదురు చూశానన్నారు సుష్మా. ఆర్టికల్‌ 370 రద్దు, కశ్మీర్‌ విభజన జరిగిన కొన్ని గంటల్లోనే ఆమె మరణించారన్న వార్త పెను విషాదాన్ని నింపుతోంది.

సుష్మా సేవలను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. సుష్మ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ప్రజా జీవితంలో విలువలు, విశ్వసనీయతతో ఆమె వ్యవహరించారని కొనియాడారు. సుష్మా ఎంతో మంది ప్రేమాభిమానాలను చూరగొన్నారని ప్రశంసించారు. ఇక సుష్మా స్వరాజ్‌ అకాల మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. భారత రాజకీయ చరిత్రలో మహోన్నతమైన శకానికి తెరపడిందన్నారు. ‘సుష్మా స్వరాజ్‌ ఎందరో ప్రజలకు ప్రేరణ కల్పించారు. పేద ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. అహర్నిశలు దేశ సేవ కోసం తపించారు అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

సుష్మా స్వరాజ్‌ పార్థివదేహాన్ని చూసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కంటతడి పెట్టారు. సుష్మాస్వరాజ్‌ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేపోతున్నానంటూ ఉద్వేగానికి గురయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వెంట వెళ్లి సుష్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు కిషన్‌రెడ్డి.. సుష్మాస్వరాజ్‌ నాకే కాదు యావత్తు తెలంగాణకు చిన్నమ్మేనన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం వచ్చేలా చేసిన ఆమె కృషిని ఎన్నటికీ మరువలేమన్నారు కిషన్‌రెడ్డి. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరు మాలాంటి వారికి స్ఫూర్తి అని... సుష్మాస్వరాజ్‌ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు.

అటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా సుష్మా మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మంచి పార్లమెంటేరియన్‌, గొప్ప వక్త అని గుర్తుచేశారు. పార్టీల కతీతంగా ఆమెకు ఎంతో మంది మంచి స్నేహితులున్నారన్నారు. ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ కూడా సంతాపం తెలిపారు. అపార అనుభవం, సంయమనం, రాజకీయ నైపుణ్యం కలబోసిన నాయకురాలంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలకతీతంగా అందరి మన్ననలందుకున్న గొప్ప పార్లమెంటేరియన్‌ అని కొనియాడారు.

Tags

Read MoreRead Less
Next Story