ద్వారకానాథ్ హత్యకు అదే కారణమా?

ద్వారకానాథ్ హత్యకు అదే కారణమా?
X

ర్యాగింగ్... ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులను బలితీసుకుంది. సీనియర్ల వేధింపులు భరించలేక జూనియర్లు కాలేజీలు మానేసిన సందర్భాలున్నాయి. అయితే ఈ ర్యాగింగ్ భూతంపై అటు పోలీసులు, ఇటు కాలేజీల యాజమాన్యాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. వేధింపులకు పాల్పడే మనస్తత్వం ఉన్నవాళ్లు తమ మనసు మాత్రం మార్చుకోవడం లేదు. ర్యాగింగ్ ఆగితే... మరోదారి వెతుక్కుంటున్నారు. ఇలాంటివారిని సోషల్ మీడియా మరింత ప్రోత్సహిస్తోంది. కొందరు గ్యాంగ్‌లుగా ఏర్పడితే... మరికొందరు గ్యాంగ్‌ లీడర్లుగా మారి వేధింపులకు దిగుతున్నారు. కాలేజీల యాజమాన్యాలు కనిపెట్టేలోపే వీళ్లంతా ముదిరిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఇలాంటివాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది..

ఇంటర్ వరకు తల్లిదండ్రులు దగ్గరుండి మరీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఏం చేస్తున్నారని పర్యవేక్షిస్తారు. దీంతో పేరెంట్స్‌కి భయపడి అణిగిమణిగి ఉంటారు. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తర్వాతే చాలామంది చేయిదాటి పోతున్నారు. తిరుపతి లాంటి ప్రాంతాలకు వెళ్లి ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్నారు. సొంతప్రాంతానికి దూరం కావడంతో ఒక్కసారిగా రెక్కలు విధిల్చి స్వేచ్ఛా విహంగాల్లా విహరిస్తున్నారు. ఏం చేసినా అడిగేవారుండరు? ఎంత బలాదూర్‌గా తిరిగినా చూసేవాళ్లుండరు. ఇదే కొందరు విద్యార్థులు పెడదోవ పట్టడానికి కారణమవుతోంది. చదువును పక్కనపెట్టి గ్యాంగ్‌లు ఏర్పాటు చేయడం, లేదంటే గ్యాంగ్‌లీడర్‌గా ఎదగడంపై ఫోకస్ పెడుతున్నారు. చివరికి గ్యాంగ్‌ల మధ్య వార్‌కు దారితీస్తోంది. ఇదే ప్రాణాలు తీస్తోంది. తిరుపతి రేణిగుంట రోడ్డులోని శెట్టిపల్లిలో జరిగిన ద్వారకానాథ్ హత్యకు ఇదే కారణమని అనుమానిస్తున్నారు. కాలేజీలో ఎవరిని అడిగినా ఇతడు గ్యాంగ్ లీడర్‌గా తయారై అందరినీ ముప్పు తిప్పలు పెట్టేవాడని చెప్పడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఆధిపత్య పోరు కోసమే ద్వారకానాథ్ హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు... ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.

ద్వారకానాథ్ స్వస్థలం కడప జిల్లా. అక్కడి నుంచి తిరుపతికి చదువు కోసం వచ్చిన అతడు గ్యాంగ్‌ లీడర్‌గా ఎదిగినట్లు భావిస్తున్నారు. అయితే అతడి కుటుంబసభ్యులు మాత్రం మావాడు అలాంటి వాడు కాదంటున్నారు.

విద్యార్థుల మధ్య ఆధిపత్య పోరు తిరుపతిలో కొత్తకాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారిన తిరుపతిలో ఏడాదికి నాలుగైదు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ర్యాగింగ్‌ను అరికడుతున్నట్లే... గ్యాంగ్ వార్‌లు, గ్యాంగ్‌ లీడర్లకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదనే విషయం మరిచిపోవద్దు.

Next Story

RELATED STORIES