ప్రధాని కంట కన్నీరు

ప్రధాని కంట కన్నీరు

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కౌశల్‌ స్వరాజ్‌తోనూ, వారి కుమార్తెతోనూ మాట్లాడే సమయంలో మోదీ కళ్లు చెమర్చాయి. దాదాపు 10 నిమిషాలు అక్కడే ఉన్న ప్రధాని.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అంత్యక్రియల ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి అమిత్‌షా కూడా సుష్మా కుటుంబాన్ని పరామర్శించారు.

అద్వానీ కుటుంబం కూడా సుష్మాస్వరాజ్‌కు నివాళులర్పించింది. సుష్మ కుమార్తె బన్సూరిని ఓదార్చుతూ అద్వానీ చలించిపోయారు. కన్నీళ్లను ఆపులేకపోయారు. సుదీర్ఘకాలంగా సన్నిహితంగా పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

ప్రముఖ న్యాయవాది హరీష్‌ సాల్వే కూడా సుష్మాస్వరాజ్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసును వాదించిన సందర్భంగా తనకు ఇవ్వాల్సిన ఫీజు తీసుకునేందుకు రేపు రావాలని సుష్మ కోరారన్నారు. చనిపోవడానికి గంట ముందు ఆమె తనతో మాట్లాడారన్నారు. కేసు గెలవడంతో తనకు ఇవ్వాల్సిన రూపాయి ఫీజు తీసుకోవడానికి రేపు రావాలని కోరారని సాల్వే తెలిపారు. రాత్రి 8 గంటల 50 నిమిషాల సమయంలో ఆమెతో మాట్లాడానని.. కేసు ఫీజుగా రావాల్సిన విలువైన రూపాయి తీసుకుంటానని చెప్పానని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story