ఓవర్ లోడ్ నావల్ల కాదు.. బస్సు దిగిన డ్రైవర్

ఓవర్ లోడ్ నావల్ల కాదు.. బస్సు దిగిన డ్రైవర్

బస్సులు తక్కువ ప్రయాణీకులు ఎక్కువ. వచ్చిన ఒక్క బస్సు కూడా వెళ్లిపోతే ఎలా. సీటు దొరక్కపోయినా పర్లేదు. బస్సు వస్తే చాలు. వచ్చిన ఆ బస్సుని వదలకుండా ఎక్కేశారు ప్రయాణీకులంతా. దాంతో ఓవర్ లోడ్ అయిపోయింది బస్సు. నా వల్ల కాదు ఇంత మందిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చగలనన్న ధైర్యం నాకు లేదంటూ డ్రైవర్ బస్సు దిగిపోయాడు. కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. వేముల వాడ నుంచి జగిత్యాల వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు కెపాసిటీ 70-80 మంది. అయితే వచ్చిన ఆ బస్సులో 130 మంది ప్రయాణీకులు ఎక్కారు. కనీసం నుంచోడానిక్కూడా వీల్లేనంతగా బస్సులో జనాలు క్రిక్కిరిసి పోయారు. ఇంతమంది ప్రయాణీకులతో బస్సుని నడపడం డ్రైవర్‌కి కష్టంగా మారింది. కొడిమ్యాల మండలం చెప్పాల దగ్గర ఇంత మంది ప్రయాణీకులుంటే బస్సు నడపలేనంటూ డ్రైవర్ బస్ దిగిపోయాడు.

అసలే ఓవర్ లోడ్‌తో వెళ్తున్న బస్సులకు అధికారులు ఫైన్ వేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలోని కొండట్టులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. ఈ ప్రమాదానికి డ్రైవర్‌దే తప్పిదంగా చూపారు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. దీంతో ప్రయాణీకులు కొంత ఆందోళన చెందినప్పటికీ డ్రైవర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ ప్రయాణీకులు బస్సు దిగి మరో బస్సు కోసం వేచి చూశారు. గంట తర్వాత వచ్చిన మరో బస్సులో ఎక్కి వెళ్లారు. బస్సుల కొరత వల్లే తాము వచ్చిన బస్సుని ఎక్కేస్తున్నామని చెబుతున్నారు ప్రయాణీకులు.

Tags

Read MoreRead Less
Next Story