దివికేగిన సుష్మమ్మ.. దిగ్భ్రాంతిలో యావత్తు దేశం

దివికేగిన సుష్మమ్మ.. దిగ్భ్రాంతిలో యావత్తు దేశం
X

చిన్నమ్మ కన్నుమూశారు.. బీజేపీ అగ్రనేతల్లో ఒకరు, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఇక లేరన్న వార్త పార్టీ వర్గాలను షాక్‌కు గురిచేసింది.. రాత్రి గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్‌ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారింది.. ఐదుగురు వైద్యులు సుష్మ ప్రాణాలను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుష్మా స్వరాజ్‌ మరణించారు.. కార్డియాక్‌ అరెస్టు వల్లే ఆమె మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు.

సుష్మా స్వరాజ్ ఇటీవలే మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్నారు. ఆ కారణంగానే 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అప్పట్నుంచి సుష్మ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది.. చికిత్స అందిస్తున్న సమయంలోనే గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది.. సుష్మా స్వరాజ్‌ వయసు 67 ఏళ్లు.. సుష్మ మరణవార్తతో బీజేపీ అగ్రనేతలంతా హతాశయులయ్యారు.. ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి.. ఆమె మరణవార్త తెలియగానే బీజేపీ అగ్రనేతలంతా హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలివచ్చారు. అటు సుష్మా మృతికి రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎయిమ్స్‌ నుంచి భౌతిక కాయాన్ని ఆమె నివాసానికి తరలించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం అక్కడే ఉంచారు.. సుష్మ పార్థివ దేహానికి బీజేపీ అగ్రనేతలంతా నివాళులర్పించారు.. మధ్యాహ్నం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్థం సుష్మ పార్థివదేహాన్ని ఉంచుతారు.. ఆ తర్వాత లోథీ రోడ్డులో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Next Story

RELATED STORIES