ఆమె అతడుగా.. అతడు ఆమెగా.. ఇద్దరూ ఒక్కటైన వేళ..

ఆమె అతడుగా.. అతడు ఆమెగా.. ఇద్దరూ ఒక్కటైన వేళ..

ఎవరో ఒకరిని ఎలా చేసుకుంటారు.. నచ్చిన వాడు దొరకాలిగా.. అతడిని చూడగానే నాకోసమే పుట్టాడనిపించాలి.. నా హృదయంలో స్థానం సంపాదించాలి.. అలానే ఎదురు చూసింది తీస్తాదాస్. ఒకప్పుడు 'సుశాంతో' అనే అబ్బాయి ఇప్పుడు అమ్మాయిగా మారి 'తీస్తాదాస్‌' అయింది. తనలాగే అమ్మాయి అబ్బాయిగా మారిన చక్రవర్తిని పెళ్లాడింది. మొదటి చూపులోనే అతడికి మనసిచ్చేసింది. అతడే తనకు తగిన వరుడనుకుంది. ఆగస్ట్ 5 సోమవారం రోజున మూడుముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఉత్తర కోల్‌కతా శివార్లలోని మహాజాతి నగర్‌లో ఉంటున్న తీస్తాదాస్ అంటే తెలియని వారుండరు. చుట్టుపక్కల వారందరికీ తలలో నాలుకలా ఉంటుంది. ఇంతకు ముందు సుశాంతోగా కొంతమందికే తెలుసు. ఇప్పుడు తీస్తాదాస్‌గా ఎక్కువ మందికి తెలియడమే కాకుండా సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ మరింత మందికి తనను తాను పరిచయం చేసుకుంది.

హైస్కూలు చదువు వరకు అబ్బాయిలానే ఉన్నా ఆ తరువాత నుంచి అమ్మాయిలా మారిపొమ్మని మనసు పోరు పెట్టేది. అమ్మాయిల్లా బట్టలు కట్టుకోవాలనిపించేది. ఈ వాలకం చూసి ఇంట్లో వాళ్లు చీవాట్లు, చిత్ర హింసలు పెట్టేవారు. అయినా తన అలవాటు మానుకోలేకపోయింది. చివరకు అమ్మాయిగా ఆపరేషన్ చేయించుకోడానికి సిద్ధపడింది. ఇందుకోసం తండ్రి బాగానే డబ్బు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఆపరేషన్ కోసం అయిన అప్పు తీర్చలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడన్న అపవాదు మూటగట్టుకుంది. మారిన అవతారం మానసిక వేధింపులకు కారణమైంది. లైంగిక వేధింపులు, లోకల్ గూంఢాలు ఏడిపించడాలు.. వీటన్నింటినీ తట్టుకోలేక తీస్తాదాస్‌గా మారిన సుశాంతో ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది.

తోటి ట్రాన్స్ జెండర్‌ల సాయంతో సొంతగా తన కాళ్లపై తాను బతకడం నేర్చుకుంది. సెక్స్ రీ అసైన్‌మెంట్ సర్జరీ చేయించుకున్నాక ట్రాన్స్‌జెండర్‌ల మానసిక స్థితి ఎలా ఉంటుందనే అంశంపై బెంగాల్‌లో ఒక సినిమా తీస్తే అందులో నటించింది. డాక్యుమెంటరీలలో నటించే అవకాశం వచ్చింది. అదే సమయంలో అస్సాంకు చెందిన చక్రవర్తితో తీస్తాకు పరిచయమైంది. అతడు కూడా ఇంతకు అమ్మాయి.. పురుషుడిగా మారాలన్న కోరికతో చక్రవర్తి అయ్యాడు. సినిమా వారిద్దరినీ ఒక్కటి చేసింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇష్టసఖుడిని పెళ్లాడానన్న ఆనందం తీస్తా కళ్లలో ఆనందభాష్పాలుగా వర్షించాయి.

Tags

Read MoreRead Less
Next Story