మానవమృగానికి ఎలాంటి సాయం చేయని బార్ అసోసియేషన్

మానవమృగానికి ఎలాంటి సాయం చేయని బార్ అసోసియేషన్
X

వరంగల్‌లో 9 నెలల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన నరరూప రాక్షసుడు ప్రవీణ్‌కు మరణశిక్ష పడింది.. దోషికి ఉరి శిక్ష వేస్తూ సంచలన తీర్పు వెలువరించారు వరంగల్ జిల్లా కోర్టు మొదటి అదనపు జడ్జి జయకుమార్‌.. పసివాళ్ల జోలికి వెళ్లాలంటే వెన్నులో వణుకుపుట్టే తీర్పిది. ఉరిశిక్ష విధించినట్లు తెలియగానే అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చివరికి కూతురు దూరమైందనే బాధలో ఉన్న తల్లిదండ్రులు కూడా కోర్టు తమకు న్యాయం చేసిందన్నారు.

మన దేశంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. కానీ ప్రవీణ్ దుర్మార్గాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అమ్మపక్కన హాయిగా నిద్రిస్తున్న చిన్నారిని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. కళ్లుకూడా తెరవని చిన్నారిని చిదమేశాడు. అయితే ఇదంతా మద్యం మత్తులోనే చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. మద్యం మత్తులో ఉన్నా... స్పృహలో ఉన్నా ఆ నరరూప రాక్షసుడు చేసిన దారుణం అత్యంత హేయమైంది. ఈ ఘటన వెలుగుచూసిన వెంటనే దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అందుకే మానవమృగానికి బార్ అసోషియేషన్ ఎలాంటి సహాయం చేయలేదు. కేసు తీవ్రతను బట్టి దేశంలోనే రికార్డు స్థాయిలో కేవలం 48 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పును వెలువరించింది కోర్టు. ఈ తీర్పుపై న్యాయవాదుహర్షం వ్యక్తం చేస్తున్నారు.. కోర్టు తీర్పు తప్పు చేయాలనుకునేవాళ్ల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఇకముందు ఇలాంటి దారుణాలు జరగబోవనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు..

ఇక నరరూప రాక్షసుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడడానికి కారణం పోలీసులే. పక్కా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టు ముందుంచారు. జూన్ 18న ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... ప్రవీణ్‌పై రకరకాల కేసులు పెట్టారు. ఐపీసీ సెక్షన్ 302, 363, 370-A, 376-A,B.. 379, 449తోపాటు ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. కేవలం 21 రోజుల్లోనే సైంటిఫిక్, హ్యూమన్ ఎవిడెన్స్ సేకరించి ఛార్జిషీటు దాఖలు చేశారు. 40 మందికిపైగా సాక్షులను విచారించారు. చివరికి పక్కా ఆధారాలతో నిందితుడిని కోర్టు బోనులో నిలబెట్టారు.

జులై 24న ప్రారంభమైన విచారణ ఈ నెల 2న ముగిసింది. పోలీసులు పక్కా సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించడంతో కేసు విచారణ త్వరగా పూర్తయింది. ఘటన జరిగిన నాటి నుంచి 48 రోజుల్లోనే కోర్టు ప్రవీణ్‌ను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో చట్టం తనపని తాను చేసుకుపోతుందని ప్రజలకు మరోసారి నమ్మకం కలిగింది.

జూన్ 17న వరంగల్‌లోని తన పుట్టింటికి వెళ్లింది రచన. ఆమెతోపాటే వెళ్లిన భర్త జగన్... పనిమీద అదేరోజు హైదరాబాద్ వచ్చాడు. ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంటి దాబాపై నిద్రించింది. అర్ధరాత్రి లేచిచూస్తే పక్కలో పాప కనిపించకపోవడంతో కంగారు పడింది. వెంటనే ఆమె తమ్ముడు చుట్టుపక్కల వెదికి చివరికి పాపను టవల్‌లో చుట్టి భుజంపై వేసుకుని వెళ్తున్న ప్రవీణ్‌ను పట్టుకున్నాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కానీ పాపను ఆసుపత్రికి తీసుకెళ్లి బతికించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ దారుణంపై వరంగల్‌తోపాటు దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం కావడంతో సవాలుగా తీసుకున్న పోలీసులు చివరికి మానవ మృగానికి శిక్ష పడేలా చేశారు..

కిరాతకుడికి కోర్టు ఉరి శిక్ష వేసింది. కానీ ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒకటే. శిక్ష ఎప్పుడు అమలవుతుంది. దీనికి చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది. వరంగల్‌లో ప్రవీణ్ తరఫున వాదించడానికి న్యాయవాదులు నిరాకరించారు. కానీ అతడికి హైకోర్టు, సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కోర్టులు ఉరి శిక్షనే ఖరారు చేస్తే... చివరికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి క్షమాభిక్ష కోరే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి అంగీకరిస్తే... శిక్ష రద్దవుతుంది. నిరాకరిస్తే ఉరి శిక్ష అమలవుతుంది. ఈ ప్రక్రియంతా పూర్తికావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని న్యాయవాదులు అంటున్నారు.

పసివాళ్లపై దారుణాలు ఆగడం లేదు. కాటికి కాళ్లు చాపే వాళ్లు కూడా చిన్నారులను చిదిమేస్తున్నారు. కామవాంఛ తీర్చుకోడానికి మృగాళ్లుగా మారుతున్నారు. ఇక్కడా అక్కడా అనే తేడా లేదు. దేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి తోడేళ్లు కాచుకుని కూర్చుంటున్నాయి. వీటి బారిన పడకుండా పసివాళ్లను కంటికి రెప్పలా కాపాడడం సాధ్యపడడం లేదు. మొన్న వరంగల్‌లో ప్రవీణ్... అంతకుముందు గుంటూరు జిల్లాలో అన్నెం సుబ్బయ్య... ఇలా వీళ్లందరిదీ ఒకటే దారి...

ఇక్కడ తేడా ఏంటంటే... ప్రవీణ్‌కు కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. కానీ అన్నెం సుబ్బయ్య స్వయంగా ఉరివేసుకుని ఉసురుతీసుకున్నాడు. చేసింది నేరం కాదు దారుణం. మాటలకు అందని కిరాతకం. ఈ సంగతి కామాంధులకు బాగా తెలుసు. అయినాసరే పసివాళ్లపై అత్యంత నీచానికి ఒడిగడుతున్నారు. కూతురు, మనవరాలి వయసున్న చిన్నారులపై అకృత్యానికి పాల్పడి నిర్దాక్ష్యిణ్యంగా చిదిమేస్తున్నారు. ఇలాంటి నరరూప రాక్షసులకు మరణ శిక్ష ఒక్కటే సరిపోదు. ఎన్ని శిక్షలు వేసిన తక్కువే..

రోజూ ఎంతో మంది పసివాళ్లు కామాంధుల కర్కషత్వానికి బలవుతున్నారు. వాటిలో బయటకు వస్తున్న ఘటనలు కొన్నే. వెలుగులోకి రాని దారుణాలకు లెక్కేలేదు. బయటపడినా... జనం స్పందనను బట్టే పోలీసులు ప్రవర్తిస్తుండడం కూడా బాధితులను మరింత కుంగదీస్తోంది. వరంగల్‌లో 9 నెలల పాపపై ప్రవీణ్ పాపానికి ఒడిగట్టి చంపేయడంపై జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ నీచుడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్లు వచ్చాయి. కానీ పోలీసులు సైలెంట్‌గా తమపని తాము చేసుకెళ్లారు. చివరికి నిందితుడికి శిక్ష పడేలా చేశారు..

జనంలో వెల్లువెత్తే ఆగ్రహావేశాలు నిందితుల్లో భయం పుట్టిస్తున్నాయి. చేతికి చిక్కితే చంపేస్తారనే భయం వెంటాడుతుంది. ఇటీవలే గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన ఘటనే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన రిక్షా కార్మికుడు అన్నెం సుబ్బయ్య ఆ తర్వాత ఎస్కేప్ అయ్యాడు. ఈ సమాచారం తెలియగానే జనం ఆగ్రహంతో రగిలిపోయారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. నిందితుడిని పట్టి తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. జనం ఆగ్రహావేశాలు చూసి ఘటనను సర్కారు సీరియస్‌గా తీసుకుంది. నిందితుడి ఆచూకీ చెప్పాలంటూ పోలీసులు నజరానా కూడా ప్రకటించారు. అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో నిందితుడికి తప్పించుకునే దారిలేకుండా పోయింది. పైగా అప్పటికే తను దారుణానికి ఒడిగట్టానని అన్నెం సుబ్బయ్యలో పశ్చత్తాపం మొదలైంది. జనం చేతికి చిక్కితే చంపేస్తారనే భయంతో చెట్టుకు ఉరివేసుకుని చేసిన పాపానికి స్వయంగా శిక్షను అనుభవించాడు..

కోర్టుకు వెళ్తున్న కేసుల్లో కూడా కఠిన శిక్షలు పడుతున్న ఘటనలు తక్కువే. పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడం, పేదలకు లాయర్లను పెట్టుకునే స్థోమత లేకపోవడం, నేరాలకు పాల్పడిన ధనవంతులు డబ్బు ఆశచూపి తప్పించుకోవడం... ఇలా ఎన్నో కారణాలు ఉంటున్నాయి. కానీ నష్టపోతున్నది, అన్యాయానికి గురవుతున్నది మాత్రం బాధితులే. మరోవైపు తగిన సాక్ష్యాధారాలున్న కేసుల్లో కోర్టులు కఠిన శిక్షలు పడుతున్నాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసిన కేసులో ఘేవర్‌సింగ్‌, శరవణ్‌సింగ్‌లకు కోర్టు ఉరిశిక్ష విధించింది. 2013 మార్చి 29న ఘటన జరిగితే... ఆగస్టు 2018లో ఉరి శిక్ష పడింది. కానీ వరంగల్‌ కోర్టు కేవలం ఘటన జరిగిన 48 రోజుల్లో అంటే నెలన్నరకే శిక్ష ఖరారు చేయడంతో దేశంలో అత్యంత వేగంగా తీర్పు వచ్చిన తొలికేసుగా భావిస్తున్నారు..

12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష విధించేలా కేంద్రం ఇటీవలే ఆర్డీనెన్స్ తెచ్చింది. అయినాసరే కామాంధుల్లో మార్పు మాత్రం రావడం లేదు. నిర్భయ, ఫోక్సో... ఇలా చట్టాలు పదునెక్కుతున్నాయి. మానవ మృగాలకు కఠిన శిక్షలు కూడా పడుతున్నాయి. అయినాసరే కామాంధులు భయపడడం లేదు. ఇలాంటి వారికి ఉరిశిక్షే సరైందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి కోర్టు ప్రవీణ్‌కు ఉరిశిక్ష వేసిన నేపథ్యంలోనైనా కామాంధులు మారుతారా? పసివాళ్ల ప్రాణాలు తీస్తే... తమ ప్రాణాలకే ముప్పనే విషయాన్ని ఇకనైనా గ్రహిస్తారా లేదా అనేది చూడాలి.

Next Story

RELATED STORIES