తెలుగు రాష్ట్రాల్లో విధులకు దూరంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు

తెలుగు రాష్ట్రాల్లో విధులకు దూరంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వైద్యుల అందోళనలు ఉధృతమవుతున్నాయి. గతవారం రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళనలు ఇంకాస్త ఉధృతం చేస్తున్నారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి అత్యవసర చికిత్సలు మినహా, అన్నిసేవలు నిలిపేశారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు అన్ని ఆస్పత్రుల్లో సేవల బంద్‌ కొనసాగుతుందని వైద్య సంఘాలు ప్రకటించాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు విధులకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లోనూ వైద్యసేవలు నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 మంది వైద్యులు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులుగా ఉన్నారు. జూనియర్‌ వైద్యులు కూడా గత వారం రోజులుగా వైద్యసేవలు బహిష్కరించారు.

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును నిరసిస్తూ వరంగల్‌లో హాస్పిటల్‌ వైద్యులు బంద్‌ కొనసాగిస్తున్నారు. వరంగల్‌ ఎంజీఏ ఆసుపత్రి నుండి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డాక్టర్లు, జూనియర్‌ డాక్టర్లు భారీగా పాల్గొన్నారు. మరోవైపు కె.ఎం.ఎస్‌ నుంచి భారీ ర్యాలీకి వైద్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

ఎన్‌ఎంసీ బిల్లుతో వైద్య రంగంపై తీవ్ర ప్రభావం పడనుందని.. వైద్య విద్య కుంటుపడుతుందని వైద్యులు, జూడాలు ఆందోళన చెందుతున్నారు. వైద్య రంగం రాష్ట్రం చేతిలో 75 శాతం ఉండగా.. కేంద్రం చేతిలో 25 శాతం మాత్రమే ఉందని, కేంద్రం మొత్తం తన గుప్పిట్లోకి తీసుకుని కార్పొరేట్‌ శక్తులకు మేలు చేసేలా బిల్లులో మార్పులు తెచ్చిందని ఐఎంఏ ఆరోపిస్తోంది. తాజా బిల్లు చట్టరూపం దాల్చితే కన్వీనర్‌ కోటా కింద 50 శాతం ఉన్న సీట్లను 15 శాతానికి కుదించి పేద, మధ్య తరగతి వారికి వైద్య వృత్తి పూర్తిగా దూరం అవుతుందని ఐఎంఏ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story