జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు సడలించే అవకాశం

జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు సడలించే అవకాశం
X

ఆర్టికల్ 370 రద్దు చేసి రోజులు గడుస్తున్నా.. కశ్మీర్‌లో ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. అల్లరిమూకలకు ఎట్టిపరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదన్న కారణంగానే నియంత్రణ కొనసాగిస్తున్నారు. కేవలం 2 జిల్లాల్లో మాత్రం శుక్రవారం నుంచి తిరిగి స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. కథువా, సాంబా జిల్లాల్లో జనజీవనం నెమ్మదిగా సాధరణ స్థితికి వస్తోంది. నిత్యావసరాలు వంటి వాటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటికే వాటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. జమ్ముకశ్మీర్, లద్ధాక్ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పరిస్థితిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాటి అవాంఛనీయ ఘటనలు జరక్కపోయినా.. లోయలో మాత్రం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఆంక్షలు సడలించే అంశంపై గవర్నర్ సమీక్షించారు. దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. నిషేధాజ్ఞల నేపథ్యంలో ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోవడంతో.. జనం ఇబ్బంది పడుతున్నా నవ కశ్మీరం నిర్మాణం కోసం కొన్ని నిబంధనలు కఠినంగానే అమలు చేస్తున్నారు. సోమవారం బక్రీద్ కూడా ఉన్నందున ఈలోపు ఆంక్షల సడలింపుపై ప్రకటన రావొచ్చు.

జమ్మూకశ్మీరులోని సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితిపై అజిత్‌దోవల్‌తోపాటు, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్వయంగా సమీక్షించారు. శ్రీనగర్ లాంటి చోట్ల మందుల కోసమో, మరో అత్యవసర పనిపైనో బయటకు వచ్చేవాళ్లు తప్ప.. జనసంచారం పెద్దగా లేదు. కశ్మీర్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు దాడులకు సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం అందడంతో.. సరిహద్దుల్లోనూ, లోయలోనూ భద్రతను మరింత పెంచారు. పలుచోట్ల ఆందోళనకు దిగేందుకు ప్రయత్నించిన వారిని అరెస్టు చేశారు.

శుక్రవారం ప్రార్థనలకు అనుమతిస్తే మళ్లీ ఉద్రిక్తపరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తమవడంతో.. ఏయే ప్రాంతాల వరకూ సడలింపు ఇవ్వాలనే దానిపై తేల్చుకోలేకపోతున్నారు. అటు, కశ్మీర్‌లోయలోని జైళ్లలో ఉన్న ఉగ్రవాదులు, పాకిస్థాన్‌ అనుకూల వేర్పాటువాదులు 70 మందిని ప్రత్యేక విమానాల్లో ఆగ్రాకు తరలించారు. ఉగ్రవాదులంతా దక్షిణ కశ్మీర్‌లోనే ప్రాబల్యం చూపిస్తున్నందున.. అక్కడ రెట్టింపు భద్రత ఏర్పాటు చేశారు. అటు, జిల్లా, డివిజన్‌ స్థాయిల్లోను, శ్రీనగర్‌లోనూ ఉద్యోగులంతా ఇవాళ్టి నుంచి విధులకు హాజరు కావాలని ఆదేశించారు.

అటు, వాఘా సరిహద్దు వద్ద సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలును పాక్‌ నిలిపివేయడం కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. వాఘా స్టేషన్‌లో నిన్న ట్రైన్‌ ఆపేయడంతో.. భారత్‌కి వస్తున్న 117 మంది జర్నీ మధ్యలో చిక్కుకుపోయారు. దీంతో.. మనవైపు నుంచి ఓ రైలును.. వాఘా స్టేషన్‌కు పంపించి పంజాబ్‌లోని అట్టారీ స్టేషన్‌కు తీసుకొచ్చారు. సంఝౌతా రైలు నిలిచిపోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. పుల్వామా దాడి, బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఫిబ్రవరిలో నిలిపేశారు. మళ్లీ ఇప్పుడు బ్రేక్ పడింది. ఐతే.. ఢిల్లీ-లాహోర్‌ బస్‌ సర్వీసులు మాత్రం యధావిధిగానే నడుస్తున్నాయి.

Next Story

RELATED STORIES