మీరు గోల్డ్‌ షాపుకు వెళుతున్నారా? అయితే కాస్త ఆగండి..

మీరు గోల్డ్‌ షాపుకు వెళుతున్నారా? అయితే కాస్త ఆగండి..

మీరు గోల్డ్‌ షాపుకు వెళ్తున్నారా? వరలక్ష్మీ వ్రతం పర్వదినాన పుత్తడి కొనేందుకు డిసైడ్‌ అయ్యారా? అయితే కాస్తా ఆగండి. పెరిగిన ధరలు మీకు షాక్‌ ఇవ్వడం ఖాయం. అవును రెండు మూడు రోజుల కింద సాధారణంగా ఉన్న పసిడి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. అందనంత దూరంలో ఉండి దోబూచులాడుతున్నాయి. రికార్డు స్థాయిలో పెరిగిన గోల్డ్‌ రేట్స్‌ వినియోగదారుల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడికి పసిడి అందని ద్రాక్షగా మారిపోయింది.

బంగారం ధర ఎన్నడూ లేని విధంగా మొదటిసారి 38 వేల మార్క్‌ను దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1113 రూపాయలకు పెరగగా.. గురువారం అది 550 రూపాయలకు చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 38 వేల 470 రూపాయలుగా ఉంది. ఇక మన హైదరాబాద్‌లో చూస్తే... ఇక్కడ 24 క్యారెట్ బంగారం ధర 38 వేలు 950 రూపాయలు ఉండగా... 22 క్యారెట్ బంగారం ధర 35 వేల 580 రూపాయలుగా ఉంది. ఇలానే పెరుగుతూ పోతే మరి కొన్ని రోజుల్లోనే 43 వేల మార్క్‌ దాటిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు బిజినెస్‌ ఎనలిస్టులు. అంతే కాదు అటు వెండి ధర కూడా భగ్గుమంటోంది. వెండి ధర కూడా పరుగులు తీస్తూ ప్రస్తుతం 44 వేల మార్క్‌కు చేరింది.

ప్రపంచంలోనే అమితంగా బంగారాన్ని ఇష్టపడేది భారతీయులే. ముఖ్యంగా భారతీయ మహిళలకు బంగారం అంటే ఎనలేని ప్రేమ. బంగారం భారతీయ సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లతో పాటు ఎలాంటి శుభకార్యాలైన బంగారం కొనాల్సిందే. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి అమాంతం బంగారు ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో వినియోగదారులు కళ్లు తేలేస్తున్నారు. బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. 10 తులాల బంగారం కొనేందుకు షాపుకు వెళ్తే.. పెరిగిన రేట్లతో అందులో సగం మాత్రమే కొనే పరిస్థితి ఏర్పడుతోంది.

గత రెండు మూడు రోజులుగా పసిడి పరుగులు ఏమాత్రం ఆగడం లేదు. చూస్తుండగానే వేల రూపాయలు పెరుగుతూ సామాన్యులకు మరింత దూరమైంది. అసలు పసిడి ధర ఎందుకు పెరుగుతోంది? ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రేట్లు పెరగడానికి కారణం ఏంటి? అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు నెలకొనడం బంగారం పెరగడానికి ఒక కారణమైతే.. దేశీయంగా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుండడం మరో కారణం. అందుకే గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బంగారమంటే భారతీయులకు ఎనలేని మోజు. ఇది మనవారి సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగం. కొంత మంది బంగారు ఆభరణాలను అందం, హోదా కోసం ధరిస్తుంటే.. మరికొంత మంది తమకు ఆర్థిక రక్షణగా ఉంటుందని కొనుగోలు చేసి దాచుకుంటున్నారు. ఫలితంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతకంతకు పెరుగుతూ కోలుకోని షాక్‌ ఇస్తున్నాయి. ఇక పెళ్లిళ్లు, పేరంటాల సమయంలో ఆభరణాలకు డిమాండ్‌ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

అటు అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. పలు దేశాల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితులున్నాయి. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వు దశాబ్దకాలం తర్వాత వడ్డీ రేటును తగ్గించింది. మరింతగా తగ్గించడానికి అవకాశం ఉందని సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణ కోసం బంగారాన్ని నమ్ముకుంటున్నారు. పెట్టుబడులను పసిడిలోకి మళ్లిస్తున్నారు. ఇది ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

నోట్ల రద్దు తర్వాత ధరలు ఇంత భారీ స్థాయిలో పెరగటం ఇదే మొదటిసారి. నోట్ల రద్దు తర్వాత పెరిగిన బంగారం ధరలు కొద్ది కాలం తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. శ్రావణ మాసం ప్రారంభమైనప్పటికీ... ధరలు పెరగడంతో ఇప్పటికే 50 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయి. శ్రావణ మాసం వేళ బంగారం కొనాలనుకున్న పసిడి ప్రియులకు పెరిగిన ధరలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.

Tags

Read MoreRead Less
Next Story