టాలీవుడ్‌కు మోదీ ఆహ్వానం

భవిష్యత్తులో కశ్మీర్‌ ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టారు ప్రధాని నరేంద్ర మోదీ.. ఆర్టికల్‌ 370, 35 ఏ రద్దు చేసిన రెండ్రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన ప్రధాని.. భావోద్వేగంతో ప్రసంగించారు.. కొత్త కశ్మీర్‌, సరికొత్త లద్ధాఖ్‌ నిర్మిద్దామంటూ పిలుపునిచ్చారు. మరోవైపు, ప్రధాని ప్రసంగంలో తెలుగు మాట కూడా వినిపించడం విశేషం.

దేశం ఒకటే.. రాజ్యాంగం ఒకటే అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము-కశ్మీర్‌ విభజన తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్‌కు కొత్త శకం మొదలైందన్నారు. ఈ 70 ఏళ్లలో కశ్మీర్‌లో జరిగిన దారుణాలను ఒక్కొక్కటిగా వివరించారు. ఇకపై ఎలాంటి అభివృద్ధి జరగనుందో కూడా స్పష్టంగా వివరించారు. మార్పు జరిగిందని, మేలు కూడా జరుగుతుందని కశ్మీరీల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.. కశ్మీరీల కష్టం యావత్‌ భారతీయుల కష్టమని అన్నారు.. వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఏదో జరిగిపోతోందంటూ జరుగుతున్న ప్రచారానికి కూడా ప్రధాని ఫుల్‌ స్టాప్‌ పెట్టారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందని చెప్పారు.. ఈద్‌ శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్‌లో బక్రీద్‌ జరుపుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు.. పండుగ రోజు కశ్మీర్‌లోని తన సొంత నివాసాలకు వెళ్లాలనుకునే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలోనే కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని.. ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం గద్దెనెక్కుతుందని మోదీ వివరించారు. యువత నుంచి కొత్త నాయకులు పుట్టుకొస్తారన్నారు.

ఇక కశ్మీర్‌ భూతల స్వర్గమని.. దేశానికే మణి మకుటమని అన్నారు ప్రధాని. ప్రపంచ పర్యాటకానికే రాజధాని అయ్యే అందాలు కశ్మీర్‌ సొంతమన్నారు. అందుకు తగిన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పరిస్థితులు మెరుగుపడితే బాలీవుడ్‌ మాత్రమే కాదని, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి షూటింగ్‌ల కోసం కశ్మీర్‌ వస్తారని మోదీ చెప్పారు. అంతేకాదు, ప్రధాని ప్రసంగంలో తెలుగు మాట కూడా వినిపించింది. షూటింగ్‌లకు రావాలంటూ సినిమా పరిశ్రమలను ఆహ్వానించే సమయంలో టాలీవుడ్‌ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని. సుందర కశ్మీర్‌లో సినిమా షూటింగ్‌ల కోసం రావాలంటూ టాలీవుడ్‌ను ఆహ్వానించారు. కశ్మీర్‌ శాశ్వతంగా యూటీ ఉండదని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదం, వేర్పాటు వాదం తొలగిపోయి పరిస్థితులు మెరుగుపడిన వెంటనే పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వస్తుందని మోదీ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story