శ్రీశైలానికి పరుగులు పెడుతున్న కృష్ణమ్మ

శ్రీశైలానికి పరుగులు పెడుతున్న కృష్ణమ్మ

దిగువన ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోయినా ఎగువన కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల రైతులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. మహారాష్ర్ట, కర్ణాకటలో కుంభవృష్టి కురుస్తుండటంతో ప్రధాన ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.. లక్షలాది క్యూసెక్కుల వరదనీరంతా కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు పరుగులు పెడుతోంది.. భారీగా వస్తున్న వరదతో తెలుగు రాష్ట్రాల వర ప్రదాయని శ్రీశైలం రిజర్వాయర్‌ నిండు కుండను తలపిస్తోంది.. దీంతో అధికారులు గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కర్ణాటక, మహారాష్ర్ట సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల రైతుల్లో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇక్కడ సరైన వర్షాలు కురవకపోయినా, ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులు నిండుతుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్‌ నిండి జూరాలకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. అక్కడ్నుంచి లక్షల క్యూసెక్కుల వరదనీరంతా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం రిజర్వాయర్‌ గరిష్ట మట్టానికి చేరువలో ఉంది.

శ్రీశైలం రిజర్వాయర్‌ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా.. 215 టీఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. అయితే, కొద్దిరోజుల నుంచి ఇన్‌ఫ్లో భారీగా నమోదవుతోంది. ప్రస్తుతం మూడు లక్షల యాభై వేల క్యూసెక్కులకుపైగా వరద నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. డ్యామ్‌లో నీటిమట్టం 877 అడుగులకు చేరింది.. దీంతో లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి 12 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి చెన్నై ప్రజలకు తాగునీరు, ముచ్చుమర్రు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి హంద్రీనీవాకు, కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేస్తున్నారు.

ఇక ఎగువన కర్ణాటక టీబీ డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో డ్యాంలో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. టీబి డ్యామ్‌ గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం 1618 అడుగులకు నీరు చేరుకుంది.. ప్రస్తుతం లక్ష క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది.. మరో 50 టీఎంసీల వరద నీరు చేరితే డ్యామ్‌ పూర్తిగా నిండనుంది.. అయితే, ప్రస్తుతానికి కాలువల ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని మాత్రమే అధికారులు విడుదల చేస్తున్నారు.. డ్యామ్‌ గరిష్టస్థాయికి చేరుకున్న తర్వాతే గేట్లు తెరవనున్నారు. మొత్తంగా ఈ సీజన్‌లో ఆలస్యంగానైనా వరుణుడు కరుణించి కుంభవృష్టి కురిపిస్తున్నాడు.. ఎగువ నుంచి వరద ఉధృతి ఇదే స్థాయిలో కొనసాగితే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నిండు కుండల్లా మారతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story