Top

బాలుడిని బలి తీసుకున్నటాబ్లెట్

బాలుడిని బలి తీసుకున్నటాబ్లెట్
X

చిన్నారుల్లో నులిపురుగల నివారణకు ఇచ్చే టాబ్లెట్లు విజయనగరంలో జిల్లాలో ఓ బాలుడి ప్రాణాలు తీశాయి. గరుగుబిల్లి మండలం కె.రామునాయుడు వలసకు చెందిన రెండేళ్ల జశ్విక్‌ అనే బాలుడు అంగన్ వాడీ కేంద్రంలో ఇచ్చిన నులిపురుగుల టాబ్లెట్‌ మింగి మృతి చెందాడు. ఉదయం అంగన్‌వాడీకి హుషారుగానే వచ్చిన బాలుడు టీచర్‌ ఇచ్చిన టాబ్లెట్‌ వేసుకున్నాడు. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వెంటనే పార్వతీపురంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయినట్లుగా వైద్యులు చెప్పారు. ఆ తర్వాత తల్లిదండ్రులు బాలుణ్ని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వారే ఇదే విషయాన్ని చెప్పారు.

అంగన్‌వాడీ కేంద్రానికి ఆడుతూపాడుతూ వెళ్లిన రెండేళ్ల చిన్నారు అకస్మాత్తుగా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.. మరోవైపు ఇదే గ్రామంలో టాబ్లెట్‌ వేసుకున్న మరో నలుగురు విద్యార్థులకు వాంతులయ్యాయి. ఇద్దరిని పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

జిల్లాలో మొత్తం 14 లక్షల మంది విద్యార్థులకు ఈ నులిపురుగుల నివారణ టాబ్లెట్లను ప్రభుత్వం పంపిణీ చేయాల్సి ఉంది.. ఈనేపథ్యంలోనే గురుగుబిల్లి మండలంలోని 3,146 మంది విద్యార్థుల కోసం ఈ టాబ్లెట్లు పంపినట్లుగా అధికారులు చెబుతున్నారు.. అయితే, పిల్లల వయసును బట్టి డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఐదేళ్లలోపు పిల్లలకు పౌడర్‌ రూపంలో నీటిలో కలిపి తాగించాల్సి ఉంటుంది. నేరుగా టాబ్లెట్లు ఇవ్వడం వల్ల వికటించే ప్రమాదం ఉంది. చనిపోయిన విద్యార్థి విషయంలో ఇదే జరిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యం ఎవరిదైనా, ఓ చిన్నారి ప్రాణం పోయింది. మరో ఇద్దరిని ఆస్పత్రి పాలు చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES