అందువల్లే గోవులు మృత్యువాత పడ్డాయా? ఆ ప్రయోగం జరిగిందా?

అందువల్లే గోవులు మృత్యువాత పడ్డాయా? ఆ ప్రయోగం జరిగిందా?

విజయవాడలో కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 గోవులు మృత్యువాత పడడం తీవ్ర కలకలం రేపుతోంది. మరికొన్ని ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి ఆవులకు పెట్టిన దాణా తిన్న ఆవులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాయి. తెల్లవారేసరికి 100 ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. కలుషిత ఆహారం తినడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందాయని నిర్వాహకులు చెబుతున్నారు. అంతే కాదు గతంలోనూ ఇదే గోశాలలో 30 ఆవులు మృతి చెందాయి. గోశాలలో మొత్తం 15 వందల ఆవులు ఉన్నాయి.

గోశాలలోనే అస్వస్థతకు గురైన మరొకొన్ని ఆవులకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే గోవులు మృత్యువాత పడ్డాయా? లేక విష ప్రయోగం జరిగిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆవులకు రాత్రి దాణా పెట్టిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.గోవుల మృతి వార్త తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గోశాలకు భారీగా తరలివచ్చారు. హృదయ విదారకరంగా పడివున్న ఆవు మృతదేహాలు చూసి భావోద్వేగానికి గురయ్యారు.

గోవుల మరణాల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపిస్తున్నారు స్థానిక బీజేపీ నేతలు. ఓ వర్గానికి చెందిన వారు విష ప్రయోగం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆవుల మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటు మృతి చెందిన ఆవులను క్రేన్‌ సహాయంతో తరలించారు. ప్రస్తుతం చనిపోయిన గోవులకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఆవులు బ్లోట్‌ సమస్యతో మృత్యువాత పడ్డాయని అన్నారు పశుసంవర్థక శాఖ అధికారులు. పోస్టు మార్టం నివేదిక తరువాతే వాస్తవాలు తెలుస్తాయని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story