వరద ఉధృతి.. మత్స్యకారులను రక్షించిన రెస్క్యూ టీమ్‌

వరద ఉధృతి.. మత్స్యకారులను రక్షించిన రెస్క్యూ టీమ్‌

ఏపీని వరద వణికిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, ఆచంట మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి గట్లను పటిష్టపరుస్తున్నారు. లంక గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. వరద చుట్టుముట్టడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. 2 వారాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. విలీన మండలాల్లో దాదాపు 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీఆర్‌ పురంలో జలదిగ్భందంలో ఉన్న ప్రజలను పోలీసులు లాంచీల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వరద ఉధృతికి పోలవరం ప్రాజెక్టులోని ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద చిక్కుకుపోయిన 32 మంది మత్స్య కారులను అధికారులు కాపాడారు. వీరందరినీ నేవీ హెలికాఫ్టర్‌ సాయంతో రెస్క్యూ టీమ్‌ రక్షించింది. ధవళేశ్వరానికి చెందిన 32 మంది మత్స్యకారులు మరబోట్లలో చేపల వేటకు వెళ్లారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తిరుగు ప్రయాణమయ్యారు. కూనవరం నుంచి ధవళేశ్వరం వెళ్తుండగా.. వీరవరపు లంక సమీపంలోని పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద చిక్కుకుపోయారు. వీరిలో 19 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. అందరినీ క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్ వే దగ్గర వరద ప్రవాహంలో ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని పోలీస్ కానిస్టేబుల్‌ సూరిబాబు కాపాడారు. వరద ప్రవాహాన్ని చూడడానికి ఈ ముగ్గురు వచ్చారు. గల్లంతైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే కాజ్ వే దగ్గర ప్రమాదాలు జరగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాజ్ వే ఎత్తు పెంచడానికి సుమారు 10 కోట్లు విడుదలయ్యాయని, అయితే అధికారులు ఎత్తు పెంపునపై నిర్లక్ష్యంగా వహించారని చెప్పారు. స్థానికుల ఆగ్రహం విషయం తెలుసుకొని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఘటనాస్థలానికి వచ్చారు. కాజ్ వే పనులు త్వరగా చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గం పరిధిలో వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలో గత 10 రోజులుగా ముంపులో ఉన్న ప్రాంతాలను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సందర్శించారు. సహాయం అందడం లేదని, కనీసం నిత్యావసర వస్తువులు లేవని, భోజనం పెట్టడం లేదని బాధితులు చెప్పడంతో ఆయన వరద నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. వెంటనే బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరం వద్ద వంశధార నది సముద్రంలో కలిసే ప్రాంతం భారీగా కోతకు గురైంది. గత టీడీపీ ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రాబోయే 3 రోజుల్లో ఓ మోస్తారు వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో గోదావరి తీర ప్రాంతం భయంతో వణికిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story