కాంగ్రెస్‌కు కొత్త బాస్‌.. రేసులో..

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు అవుతున్నా.. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా తేరుకోలేదు. జాతీయ స్థాయిలో పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. పార్టీ బాధ్యతలు చేపట్టే నూతన అధ్యక్షుడి ఎంపికే సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. మళ్లీ వెంటనే వెనక్కి పోతున్నాయి. అసలు ఎవరికి బాధ్యతలు కట్టబెట్టాలో పార్టీ నాయకత్వానికే ఓ క్లారిటీ లేదా అని కేడర్‌ అయోమయానికి గురవుతున్నారు. ముందుగా సీనియర్లను సంప్రదించారు. పెద్దోళ్లు కాదనడంతో యువనాయకులపై దృష్టి పెట్టారు. దాంతో యంగ్ లీడర్లలో ఆశలు చిగురించాయి. ఐతే, ఆ ఆశలను మొగ్గలోనే చిదిమేశారు. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి విధేయతవైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మళ్లీ గాంధీ కుటుంబానికి విధేయుడైన వ్యక్తికే పగ్గాలు అప్పగించే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. శనివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలోనే నిర్ణయం రావొచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక చివరి దశకు చేరింది. సీనియర్‌ నాయకులు ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌, కేసీ వేణుగోపాల్‌ తదితరులు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై సోనియాతో మంతనాలు జరిపారు. నాయకుడి ఎంపికపై ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదని సూచించారు. ఇప్పటికే లేటైందని, కొత్త అధ్యక్షున్ని ఒకటి-రెండు రోజుల్లో ప్రకటించాలని కోరారు. ఇందుకు సోనియా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. CWC భేటీలో కాంగ్రెస్ కొత్త బాస్‌ను ప్రకటించే అవకాశాలున్నాయ.

కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్ పేరు తెరపైకి వచ్చింది. అధ్యక్ష రేసులో ముకుల్ వాస్నిక్ ముందంజలో ఉన్నారని సమాచారం. సోనియాగాంధీకి సన్నిహితు డు కావడంతో పాటు గాంధీ-నెహ్రూ కుటుంబానికి విధేయుడు కావడం ముకుల్ వాస్నిక్‌కు కలసి వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని సరిదిద్దడం ముకుల్‌కే సాధ్యమని సోనియా భావిస్తున్నట్లు సమాచారం. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ముకుల్ సరైనవారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

59ఏళ్ల ముకుల్‌ వాస్నిక్‌ కాంగ్రెస్‌ నాయకుడు బాలకృష్ణ వాస్నిక్‌ కుమారుడు. 25ఏళ్ల వయసులోనే పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. పీవీ నరసింహరావు, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సోనియాగాంధీకి కార్యదర్శిగా కొనసాగారు. పాలనా వ్యవహారాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది.

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. సీనియర్ నాయకులు ఎంతగా వారించినా వెనక్కి తగ్గలేదు. పైగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని సూచించారు. దాంతో ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌లను అడిగితే, వాళ్లు సున్నితంగా తిరస్క రించారు. ఆ తర్వాత జ్యోతిరాధిత్య సింధియా, సచిన్ పైలట్‌ల పేర్లు బలంగా వినిపించాయి. చివరికి బాల్ మళ్లీ సోనియా ఇంటికే చేరింది. ప్రియాంకా వాద్రా పేరు తెరపైకి వచ్చింది. ప్రియాంక మాత్రం... మీకో నమస్కారం అంటూ తప్పుకున్నారు. దాంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇదే సమయంలో కశ్మీర్ అంశంపై సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరికొందరు నాయకులు ఆర్టికల్-370 రద్దుపై కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం చేస్తే అది మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశముందని సోనియా భావించినట్లు సమాచారం. అందుకే, శనివారం CWC భేటీలో ఏదో ఒకటి తేలుస్తారని అంటున్నారు.

Next Story

RELATED STORIES