నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. నాలుగు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం డ్యామ్‌ గేట్లు తెరుచుకున్నాయి. వరద పోటెత్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది.. దీంతో నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌.. తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి గంగమ్మకు పూజలు నిర్వహించారు.. అనంతరం గేట్లను తెరిచారు.. దీంతో కృష్ణమ్మ పరుగులు పెడుతూ సాగర్‌ వైపు కదులుతోంది.. మొదట 6వ నెంబర్‌ గేటను ఎత్తారు. ఆ తర్వాత 7, 8, 9 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి వరద పోటెత్తుతోంది.. ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాల నుంచి అవుట్‌ ఫ్లో భారీగా నమోదవుతోంది.. దీంతో శ్రీశైలం రిజర్వాయర్‌ నిండు కుండలా మారింది. విద్యుదుత్పత్తి ద్వారా 74,654 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తుండగా.. తాజాగా నాలుగు గేట్లను ఎత్తి దిగువకు లక్ష క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఎస్‌ఆర్‌ఎంసీ కాలువకు 20వేల క్యూసెక్కులు, హంద్రీనీవా కాలువకు 338, ముచ్చుమర్రి లిఫ్టు నుంచి కేసీ కాలువకు 735 క్యూసెక్కులు, తెలంగాణలోని కల్వకుర్తి లిఫ్టు ద్వారా 1,600క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 880 అడుగులు దాటింది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 189.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరికొద్దిరోజులు వరద ఉధృతి ఇదే విధంగా కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సందర్శకులు కృష్ణమ్మ గలగలలను చూసేందుకు తరలివస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story