గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు..

గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు..

గుప్త నిధుల కోసం దుండగులు రెచ్చిపోతున్నారు. గుప్తనిధుల కోసం మనుషులను, జంతువులను బలివ్వడం చూశాం. ఇప్పుడు ఏకంగా వాటి కోసం చారిత్రక ఆలయాలనే ధ్వంసం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామ శివారులోని కొండపై ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి.

గతరాత్రి వాచ్‌మెన్‌ ఇంటికి వెళ్లాక కొందరు గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరిపారు. నంది విగ్రహం, వెయ్యుపడగల నాగుల విగ్రహం, శివలింగాలను తవ్వి ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం శ్రీకృష్ణాదేవరాయల కాలంలో ఈ శివాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం దేవాదాయ, ఆర్కియాలజీ శాఖల పరిధిలో ఉండడంతో టెంపుల్‌ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. దీంతో ఇక్కడ అపారమైన నిధి, నిక్షేపాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది.

ఇదే కాదు గతంలోనూ ఈ ఆలయంపై దుండగులు కన్నేశారు. నైట్‌ వాచ్‌మెన్‌ను కొట్టి గుప్త నిధుల కోసం దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపింది.. ఇప్పుడు తవ్వకాలు జరిపింది ఒక్కరేనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు చేపట్టకపోతే చరిత్ర ఆనవాళ్లు కూడా మిగలవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story