ఆ జిల్లాల్లో పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలోనే గ్రామాలు..

ఆ జిల్లాల్లో పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలోనే గ్రామాలు..

ఇళ్లు, పంటపొలాలు, తోటలు, కాలువలు అన్ని ఏకం అయ్యాయి. ఎటు చూసిన కనుచూపు మేర నీరే కనిపిస్తోంది. వర్షం తగ్గినా..ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతి ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లంక గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పది రోజులుగా ఇక్కడి గ్రామాలు నీటిలో నానుతున్నాయి.

ఉభయ గోదావరి జిల్లాల్లో 159 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, అయినవిల్లి మండలాల్లోని లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వరద ఉధృతితో ఏపీ నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కోనసీమలోని అప్పనపల్లి, జి.పెదపూడి, ముక్తేశ్వరం గ్రామాల్లోని కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తోంది. బూరుగులంక, అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక సహా పలు లంక గ్రామాలు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజలు మర పడవలు, నాటుపడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్ధులు ప్రమాద పరిస్థితుల్లో పడవల్లోనే ప్రయాణం చేస్తున్నారు. వరదలో విషసర్పాల భయం ముంపు బాధితులను వణికిస్తోంది.

మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో వరదలు విషాదాన్ని మిగిల్చాయి. అడ్డతీగల మండలం కొచ్చావారివీధిలో భద్రమ్మ అనే మహిళ మడేరు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. అప్పనపల్లి కాజ్‌వే దగ్గర వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన నాని, షమీర్‌ కోసం గాలింపు కొనసాగుతోంది. 24 గంటలు దాటినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. SDRF, ఫైర్ సిబ్బంది.. హెలికాప్టర్ సాయంతో గాలింపు జరుపుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాల్లోనూ వరద పోటెత్తింది. జిల్లాతో పాటు ఎగువ కురుస్తున్న వర్షాలకు వంశాధార, నాగావళి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నది పరివాహక ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. అయితే గత రెండు రోజుల కంటే కాస్తా వరద ఉధృతి తగ్గడంతో పరివాహక గ్రామస్తులు ఊపిరి పిల్చుకున్నారు.

రాజమహేంద్రవరం వద్ద గోదావరికి వరద మరింత పెరిగింది. గోదారి ప్రవాహం అత్యంత ప్రమాదకరంగా సాగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 15.6 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. డెల్టా కాల్వలకు 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 15.51 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది.

ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరటంతో బ్యాక్ వాటర్ కారణంగా 150 ఎకరాల మేర పంటపొలాలు నీటమునిగాయి. అటు జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో బీచుపల్లి శవాలయం నీటమునిగింది. పంటపాలలు నీటిపాలయ్యాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story