తెలంగాణపై బీజేపీ నజర్‌.. కమలంలోకి కీలక నేతలు

తెలంగాణపై  బీజేపీ నజర్‌.. కమలంలోకి కీలక నేతలు

ఉత్తరాదిలో బీజేపీకి తిరుగులేదు. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఇంకా పట్టుచిక్క లేదు. అందుకే తెలుగు రాష్ట్రాలపై స్పెషల్‌గా ఫోకస్ చేస్తోంది హైకమాండ్. సభ్యత్వ నమోదుపై రాష్ట్రనేతలకు భారీ టార్గెట్ ఇచ్చారు. చేరికలను కూడా పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారు. అయితే ఢిల్లీ పెద్దలు ఆశించిన స్థాయిలో పని జరగడం లేదనే ఆరోపణలున్నాయి. అందుకే సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకునేందుకు మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లారు నేతలు.

తెలంగాణ‌లో కమలదళానికి 18 లక్షల సభ్యత్వం ఉంది. దీన్ని రెట్టింపు చేయాలన్నది టార్గెట్‌. ఆమిత్ ‌షా స్వయంగా రాష్ట్రానికి వచ్చి.. మెంబర్‌షిప్ పోగ్రామ్‌ ప్రారంభించారు. అయితే పార్టీ పెద్దలు ఆశించిన స్థాయిలో సభ్యత్వాలు నమోదు కావడం లేదు. మూడో వంతు కూడా పూర్తిచేయలేక పోయారు నేతలు. పార్ల‌మెంట్ స‌మావేశాలు, వ‌ర్షాల ప్ర‌భావంతో నేత‌లు క్షేత్ర స్థాయిలోకి సరిగా వెళ్లలేదనే ఫిర్యాదుల‌తో సభ్యత్వ నమోదుకు మరో 10 రోజులు గడువు పెంచారు. ఆగ‌స్టు 20లోగా 18ల‌క్ష‌ల టార్గెట్‌ రీచ్ అయ్యేందుకు మ‌రోమారు జిల్లాల బాట ప‌ట్టారు రాష్ట్ర స్థాయి నేత‌లు. కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ల‌క్ష్మ‌ణ్ జ‌హీరాబాద్ ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఇక ఈనెల 18న బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ జేపీ న‌డ్డా హైదరాబాద్ రానుండటంతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అలాగే పెద్ద ఎత్తున చేరికలు జరిగేలా చూస్తున్నారు.

తెలంగాణ బీజేపీ నేతల తీరుపై హైకమాండ్ కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత ప్రోత్సహించినా అనుకున్న రేంజ్‌లో పనిచేయడం లేదనే అభిప్రాయంలో ఉన్నారు. అందుకే ఇంటింటికి వెళ్ళి స‌భ్య‌త్వాలు తీసుకోవాలంటూ ఆదేశిస్తున్నారు. ఒక్కో డివిజ‌న్‌లో క‌నీసం 20 శాతం అద‌నంగా మెంబర్లను చేర్పించేలా టార్గెట్ పెట్టుకోవాల‌ని కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి సూచించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలతోపాటు., కశ్మీర్ అంశాన్ని విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారాయన. తొలి విడతలో బీజేపీ చేపట్టిన స‌భ్య‌త్వ న‌మోదుకు రాష్ట్రంలో అనుకున్నంత స్పంద‌న రాలేదు. మరి పెంచిన గడువులోగా నైనా లక్ష్యాన్ని చేరుకుంటారా!

Tags

Read MoreRead Less
Next Story