అసలు ఏపీలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా?: చంద్రబాబు

ఏపీలో జగన్‌ పాలనపై ట్విట్టర్‌ వార్‌ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లు వరస ట్వీట్లతో దాడి చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలపై చంద్రబాబు మండిపడ్డారు. తమ తప్పులను ఎత్తిచూపే విలేఖర్లపై దాడి చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు లోకేష్‌ సైతం జగన్‌ మరోసారి స్కామ్‌ స్టార్‌ అని నిరూపించుకున్నారంటూ విమర్శించారు.

ఏపీ సీఎం జగన్‌, వైసీపీ నేతల తీరుపై టీడీపీ అధినేత చందబ్రాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలవరం లాంటి ప్రాజెక్టు కట్టడమంటే కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్ కాసినంత సులభం అన్నట్లు కొందరు మేధావులు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర పర్యవేక్షణ, పోలవరం అథారిటీ నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టామని చంద్రబాబు గుర్తు చేశారు.

నెల్లూరులో జర్నలిస్టు ప్రసాద్‌పై ఎమ్మెల్యే కోటం రెడ్డి దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైసీపీ వాళ్లు తప్పులు చేస్తారు.. ఆ తప్పుల్ని ఎత్తిచూపిన వాళ్ళను చంపడానికి వెళ్తారని ట్విట్టర్‌లో మండిపడ్డారు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా అని ప్రశ్నించారు. బాధితుడి వీడియోను తన ట్విట్టర్‌లో చంద్రబాబు పోస్టు చేశారు.

ఏపీ సీఎం జగన్‌ పాలనపై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌ మరోసారి నిప్పులు చెరిగారు. మద్యం మానవ సంబంధాలని మంటగలుపుతుందని జగన్ అన్నమాటను వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిజం చేశారంటూ లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఇటు గ్రామ వాలంటీర్ల నియామకంపైనా లోకేష్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌.. స్కామ్ స్టార్ అని మరో సారి రుజువైందని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్ల స్కామ్‌తో 12వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారని ఆరోపించారు లోకే్శ్.

Tags

Read MoreRead Less
Next Story