దిక్కులేక అల్లాడుతున్న లంక గ్రామాలు..

దిక్కులేక అల్లాడుతున్న లంక గ్రామాలు..

తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమను వరద ముంపు వెంటాడుతూనే ఉంది. ధవళేశ్వరం వద్ద వరద తగ్గడంతో 2వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నా.. లంక గ్రామాలు మాత్రం ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. తమను పట్టించుకునే వారే లేకుండా పోయారంటూ ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మంచినీళ్లు, పాల ప్యాకెట్లకు కూడా దిక్కులేక అల్లాడుతున్నారు. శివాయిలంక, నాగుల్లంక, తొత్తరమూడి, వీరవల్లిపాలెం, శ్రీరాంపేటలో.. పేదలంతా పస్తులుండాల్సి వస్తోంది. దేవీపట్నం మండలం అగ్రహారం గ్రామస్తులు 12 రోజులుగా ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలలోనే తలదాచుకుంటున్నారు. వరద ఉధృతి తగ్గకపోవడంతో ఇక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక అప్పన్నపల్లి కాజ్‌వేపై గల్లంతయిన యువకుల్లో ఒకరి మృతదేహాం బయటపడింది. ప్రమాదమని తెలిసినా నిత్యావసరాల కోసం నాటుపడవల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు లంకగ్రామాల ప్రజలు.

భద్రాచలం ఏజెన్సీలో తగ్గుతూ వస్తున్న గోదావరి స్వల్పంగా పెరిగింది. నిన్న ఉదయం 6 గంటలకు 35.8 అడుగులు ఉన్న గోదావరి తర్వాత తగ్గుతూ వచ్చింది. సాయంత్రం వరకు నిలకడగానే ఉన్నా.. ఆ తర్వాత నీటిమట్టం పెరిగింది.. నిన్న రాత్రి 35.2 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. పోలవరం వద్ద కడెమ్మ వంతెన, కొత్తూరు కాజ్‌వేపై వరద కొనసాగుతోంది. మరో వారంపాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పాత పోలవరం గ్రామానికి రక్షణగా నిర్మించిన నక్లెస్‌బండ్‌ నాలుగు రోజులుగా వరద తీవ్రతకు కోతకు గురవుతోంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈనెలలో ఇప్పటి వరకు గోదావరికి వచ్చిన వరదల వల్ల 834 టీఎంసీల నీరు కాటన్‌ బ్యారేజ్‌ నుంచి సముద్రంలో కలిసింది.

తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మరింత బలపడి వాయువ్య బంగాళాఖాతం వైపు పయనించి అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఈరోజు రాత్రి లేదా రేపటికి అల్పపీడనంగా మారొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి పవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందంటున్నారు. ఈరోజు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. రేపు కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో, యానాంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు జల్లులు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అటు విశాఖ, విజయనగరం జిల్లాల్లో సాయంత్రం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన జల్లులు పడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story